సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్ళచెరువు మండలం రాఘవపురం చెరువులో గత నెలరోజులుగా మట్టి దందా యథేచ్ఛగా కొనసాగుతుంది.గ్రామ చెరువులో మట్టిని తోడడం మూలంగా నీళ్ళు లేక ఖాళీ చెరువు దర్శనమిస్తోంది.
మట్టి మాఫియాపై సంబంధిత అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకునే నాథుడు లేరని గ్రామస్తులు వాపోతున్నారు.దీనికి కారణం రెవిన్యూ,ఐబి అధికారులకు పెద్ద మొత్తంలో మామూళ్ల రూపంలో పారితోషకం అందుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అందుకే మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు పట్టపగలు మట్టి మాఫియా అడ్డూ అదుపూ లేకుండా మట్టిని తోడేస్తున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.చెరువులో ఉండే సారవంతమైన మట్టి గ్రామ రైతుల భూముల్లోకి వెళ్లాల్సి ఉండగా అది వారికి అందని ద్రాక్షాలాగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాఘవపురం చెరువులో నీళ్లు లేకపోవడంతో ఇదే అదునుగా భావించి మట్టి మాఫియా బరితెగించి అక్రమంగా చెరువు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని గ్రామ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.ఈ మట్టి మాఫియాకు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు కూడా చేసేదేమీ లేక వారికి తలోగ్గుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రాఘవపురం చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.