సూర్యాపేట జిల్లా:వయో వృద్ధుల పట్ల ప్రేమ,బాధ్యత చూపాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు.
బుధవారం జూన్ 15 ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా వయో వృద్ధుల వేధింపులపై అవగాహన పోస్టర్ ను ఐసీడీయస్ పిడితో కలసి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వయో వృద్ధులను ఎవరు కూడా వేధింపులకు గురి చేసినా,హింసించినా,వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు.వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏల్డర్ లైన్ 14567 హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిందని, ఇప్పటికే జిల్లాలో వృద్ధుల వేధింపుల నివారణకు సంబంధిత శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ హెల్ప్ లైన్ ద్వారా నిరాశ్రయులకు ఆదరణ,వేధింపులకు గురవుతున్న వృద్ధుల సంరక్షణ,మానసిక భావోద్వేగాలకు సలహాలు,సూచనలు,చట్టపరమైన మార్గదర్శకత్వం మరియు వృద్ధాశ్రమాలు,సంరక్షకులు గురించి సమాచారం అందిస్తారని,వయోవృద్ధులను ఎవరైనా ఇబ్బందులకు గురి చేసిన,మానసికంగా లేదా శారీరకంగా వేధింపులకు గురి చేసి హింసించినా హెల్ప్ లైన్ కి ఫిర్యాదు చేయవొచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ బి.వినోద్,జిల్లా కోఆర్డినేటర్ పి.సంపత్ తదితరులు పాల్గొన్నారు.