నల్లగొండ జిల్లా:దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న పేదల ఆకలి తీర్చడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం కొందరికి అక్రమ సంపాదనగా మారాయి.ప్రజల దగ్గర నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసే వారు కొందరైతే,మరికొందరు నేరుగా రేషన్ డీలర్లతో కుమ్మక్కై,సిండికేట్‌గా ఏర్పడి రాత్రి వేళలో లారీలు,మినీవ్యాన్‌లు, ఆటో ట్రాలీలలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ( Nagarjunasagar )సరిహద్దు దాటించి ఆంధ్రా ప్రాంతానికి రహస్యంగా తరలిస్తూ రూ.
కోట్ల ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.చాలాకాలంగా ఈ రేషన్ బియ్యం దందా యధేచ్చగా జరుగుతున్నా అక్రమార్కులను అరికట్టాల్సిన పోలీస్, రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
పోలీసుల అడపాదడపా తనిఖీలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది.రేషన్ బియ్యం దందా చేసే ముఠా సభ్యులు బియ్యం లారీకి అర కిలోమీటర్ ముందు కార్లలో ప్రయాణిస్తూ పోలీసుల కళ్లుగప్పి చాకచక్యంగా అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం.
పొరపాటున తనిఖీల్లో పట్టుబడినా తమ పేర్లు చెప్పకూడదని లారీ యజమానులు, డ్రైవర్లతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుని, ఇందుకు అవసరమైన మేర డబ్బును బియ్యం మాఫియా లారీ యజమానులకు, డ్రైవర్లకు ఇస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా అధికార యంత్రాంగం పటిష్ట నిఘా ఏర్పాటు చేసి అక్రమార్కులకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు.