సూర్యాపేట జిల్లా:మే 23 నుండి జూన్ 1 వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించుటకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం హైదరాబాద్ నుండి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేనతో కలిసి 10వ తరగతి పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మే 23,2022 నుంచి జూన్ 01,2022 వరకు 10వ తరగతి పరీక్షల నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని,దీని కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అధికారులను ఆదేశించారు.మన రాష్ట్రంలో ఎక్కడకూడా ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని,చివరి అరగంట సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.ప్రశ్నాపత్రాల తరలింపు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని,అవసరమైన మేరకు పోలీసు బందోబస్తు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.10వ తరగతి పరీక్షల నిర్వహణకు అవసరమైన ప్రశ్నపత్రాలు,ఓఎంఆర్ షీట్లను జిల్లాలకు తరలించామని, పరీక్ష కేంద్రాల వద్దకు ఓఎంఆర్ షీట్లను తరలించి వెరిఫై చేయాలని ఆయన సూచించారు.ప్రతి పరీక్షా కేంద్రంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని,వాటి పర్యవేక్షణలో మాత్రమే ప్రశ్నాపత్రాలను ఓపెన్ చేయాలని తెలిపారు.ప్రశ్నాపత్రాల లీకేజీ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు.విద్యార్థులు కనీసం 45 నిమిషాల ముందు పరీక్ష కేంద్రానికి చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సుల రూట్ మ్యాపింగ్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.
పాఠశాలలో ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనుమతించవద్దని, విద్యార్థులను తనిఖీ చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.పరీక్ష కేంద్రాల సమీపంలోగల జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు.
పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బందికి ఐడెంటి కార్డు తీసుకొని రావాలని ఆయన తెలిపారు.అనంతరం ఆయన మనఊరు-మనబడి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు.మనఊరు-మనబడి కింద మొదటిదశలో ఎంపికైన పనులకు పరిపాలన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని,మంజూరు చేసిన పనులను క్షేత్రస్థాయిలో గ్రౌండ్ చేయాలని ఆయన ఆదేశించారు.సమావేశంలో పాల్గొన్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన మాట్లాడుతూ పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు ముందస్తుగా పరిశీలించాలని సూచించారు.కాంపోజిట్ కోర్స్ విద్యార్థులకు మొదటి లాంగ్వేజ్ పరీక్ష 2 పేపర్లు అదేరోజు ఉదయం నిర్వహించడం జరుగుతుందని , ఉదయం 9.30 నుండి 11.45 ఒక పేపర్,11.45 నుండి 12.45 వరకు 2వ పేపర్ నిర్వహించడం జరుగుతుందని ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని,ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 6,426 మంది బాలురు,6,190 మంది బాలికలు ఈ పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు.పరీక్షల నిర్వహణ కోసం ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్ మెంట్ ఆఫీసర్,సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు.
పరీక్షలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు.ప్రతి పరీక్షా కేంద్రంలో సి ఎస్ రూమ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు, అన్ని కేంద్రలలో మౌళిక వసతులు కల్పించామని అన్నారు.
పరీక్షా పత్రాలను సీసీ కెమెరాల ముందు తెరవాలని,పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను ప్యాకింగ్ సీజ్ చేయడం కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో చేయడం జరుగుతుందని చెప్పారు.అనంతరం మనఊరు-మనబడి పథకంపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 329 పాఠశాలలు ఎంపిక కాబడినవని గ్రౌండింగ్ అయిన ఐదు పాఠశాలలో పనులను ప్రారంభించడం జరిగిందని మిగతా వాటిని కూడా త్వరలో చేపట్టనున్నట్లు వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్,డిఈఓ అశోక్,డిపిఓ యాదయ్య,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.