ప్రభుత్వ పాఠశాలను పాకశాలగా మార్చిన మందుబాబులు

సూర్యాపేట జిల్లా:విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ భవిష్యత్ సమాజ నిర్మాణానికి దశాదిశ చూపించే పాఠశాలల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న విషయాలు తరచుగా వెలుగు చూస్తూనే ఉన్నాయి.కొంతమంది ప్రబుద్దులు ప్రభుత్వ పాఠశాలలను పాకశాలలుగా మార్చి విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ,అందులోనే బాటిళ్లు వదిలెళ్లడం, బాటిల్స్ పగులకొట్టి గాజు పెంకులు స్కూల్లోనే పడేయడం లాంటి ఉన్మాదపు చర్యలు చూసుంటాం.

 Drug Addicts Who Turned A Government School Into A Kitchen-TeluguStop.com

అవన్నీ ఎక్కడో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో జరిగినవే.కానీ,నాగరికులమని గొప్పలు చెప్పుకొని తిరిగే పట్టణాల్లో కూడా అలాంటి సంఘటనలు జరగడం విస్మయానికి గురి చేస్తోంది.

రాష్ట్రంలో ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం లభించడంతో కొందరు మందుబాబులు కన్నుమిన్ను కానకుండా బరితెగించి పాఠశాలను బార్లుగా మారుస్తున్న వైనం ఈ మధ్యకాలంలో అధికమైంది.పాఠశాలలకు సెలవులు ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడమే మనం ఇప్పటి వరకు చూసి ఉంటాం.

కానీ,సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మందుబాబులు కొత్త ట్రెండ్ సెట్ చేశారు.ఏకంగా పాఠశాల వర్కింగ్ డేస్ లోనే యథేచ్ఛగా ఈ దుర్మార్గాన్ని పాల్పడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

గత వారం రోజులు క్రితం వరకు వర్షాల వల్ల విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.తిరిగి సోమవారం బడులు ఓపెన్ అయ్యాయి.

మంగళవారం రాత్రి కొంతమంది మందుబాబులు నేరేడుచర్ల పట్టణంలో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాల భవనంపై మద్యం సేవించారు.పెగ్గేయడానికి హైస్కూలు బగ్గా వైన్స్ సిట్టింగ్ సెంటర్ అనుకున్నారేమో తెలియదు కానీ, ఏకంగా ప్రభుత్వ పాఠశాల బిల్డింగ్ పైనే మకాం వేసి ఫుల్ గా మందు కొట్టారు.

ఖాళీ బీరు బాటిళ్లు అక్కడే పడేసి ఎంచక్కా వెళ్లిపోయారు.ఈ విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది.

దీనితో పాఠశాల ఉపాధ్యాయులు,పిల్లలు వాటిని చూసి ఆందోళన చెందుతున్నారు.నేరేడుచర్ల పట్టణంలో ఆకతాయిలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని,ప్రభుత్వ పాఠశాలలు మందు బాబులకు అడ్డాలుగా మారుతున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలో ఇలాంటి పనులు చేయకూడదన్న జ్ఞానం లేకుండా పోయిందని,ఇక్కడ మనల్ని అడిగే వారెవరు లేరనే బరితెగింపుతో పాఠశాల భవనాలను బార్లుగా మారుస్తున్నారని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.మద్యం సేవించి బాటిల్స్ పగలగొట్టి గాజు పెంకులు అక్కడే వేయడంతో పాఠశాల విద్యార్థులు గ్రౌండ్ చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.

ఇలాంటి చర్యలు వలన ఉదయం పాఠశాలలో వ్యాయామం చేసే వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు.గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని,అప్పుడే సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు మళ్ళీ ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా విద్యాశాఖ,పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి పవిత్రమైన పాఠశాలాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టి,రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహించి ఆకతాయిల ఆటలు కట్టించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube