సూర్యాపేట జిల్లా: దేశ వ్యాప్తంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపిలతో, తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీతో ఈ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ఒంటరిగా తలపడుతుందని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి అన్నారు.బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఎస్పి అధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆమె ముఖ్యాతిథిగా హాజరై ప్రసంగించారు.
ఓబీసీ రిజర్వేషన్ల కోసం మండల్ కమీషన్ నివేదిక అమలు చేయాలని దేశ వ్యాప్తంగా ఉద్యమం చేసి, విపీ సింగ్ ప్రభుత్వం మేడలు వంచి ఓబీసీ రిజర్వేషన్లు సాధించిన ఘనత బీఎస్పీకే దక్కుతుందన్నారు.ఓబీసీలకు విద్య,ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంలో బీఎస్పీ పాత్ర కీలకమన్నారు.
దేశంలో అణగారిన వర్గాలైన బీసీ,ఎస్సీ,ఎస్టీ వర్గాలకు రాజ్యాధికారం అందించి సమసమాజ స్థాపనకు కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీనేనన్నారు.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీల పాలనలో పేదల బతుకు మారలేదన్నారు.
డా.బి.ఆర్.అంబేద్కర్ కు భారతరత్నను ఇవ్వకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు.
దీని కోసం కాంగ్రెస్ పై పోరాడింది తమ పార్టీనేనన్నారు.బీఎస్పీ అధికారంలోకి వస్తేనే ఎస్సీ, ఎస్టీ,ఓబీసీలకు న్యాయం జరుగుతుందని,దేశంలో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు అణగారిన వర్గాలను అణిచివేసేందకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
సంపన్న వర్గాల కోసం,సంపన్న వర్గాల చేత నడుపబడుతున్న పార్టీలు బీజేపి,కాంగ్రెస్ పార్టీలని విమర్శలు గుప్పించారు.రాజ్యాంగమే ఎన్నికల మ్యానిఫెస్టోగా ప్రజల విరాళాలతో నడుపబడుతున్న పార్టీ బీఎస్పీ అన్నారు.
మిగిలిన పార్టీలన్నీ ఓట్ల కోసం ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలను మభ్యపడుతున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పారు.అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇక్కడి ప్రజలను మోసం చేసిందని,ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో, రాష్ట్రంలో బీసీ,ఎస్సీ,ఎస్టీల హక్కులకు రక్షణ కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని,మళ్ళీ ఓటేస్తే తెలంగాణ అగమవుతుందన్నారు.
సూర్యాపేట బీఎస్పీ అభ్యర్ధి వట్టే జానయ్యపై కొందరు దుండగులు రాజకీయ కక్షతో హత్యాయత్నం చేశారని, ఆయనకు రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా వైపల్యం చెందారని,రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు.
బహుజన రాజ్యం కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్న పార్టీ బీఎస్పీనే అన్నారు.బహుజన మహనీయుల స్పూర్తితో బహుజనులందరూ రాజకీయంగా ఒక్కటై ఆధిపత్య పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్,బీజేపి,బీఆర్ఎస్ అన్నీ దోపిడీ పార్టీలేనన్న ఆమె బీఎస్పీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఓబీసీలు,దళితులు, గిరిజన ఆదివాసీలకు సమానంగా పార్టీ అభ్యర్థులను ప్రకటించిందన్నారు.
తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రి చేసేందుకు పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని సూచించారు.అనంతరం సభా వేదికపై ప్రజలకు అభివాదం చేస్తూ, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో కరచాలనం చేశారు.
అనంతరం రాష్ట్ర బీఎస్పీ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం1.20 లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.మేడిగడ్డ బ్యారేజీ కూలిపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ 30 శాతం కమీషన్లేనన్నారు.త్యాగాల తెలంగాణలో కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని,1300 మంది విద్యార్థులు అమరులైతే వారి ఆకాంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ఉక్కు మహిళ మాయావతి నాయకత్వంలో పార్టీ దేశవ్యాప్తంగా మరింత బలపడుతుందన్నారు.బీఎస్పీ సభకు వచ్చే కార్యకర్తలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని,ఇది సరైన పద్దతి కాదన్నారు.
బహుజనులకు రాజ్యాధికారం బీఎస్పీతోనే సాధ్యమని,ఎన్నికల్లో సూర్యాపేటలో వట్టే జానయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని,కేసీఆర్ దోపిడీ ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.