పర్యావరణ అనుమతులు లేకుండా మైనింగ్ దందా

సూర్యాపేట జిల్లా:మొన్న డెక్కన్ సిమెంట్స్,నిన్న ఎన్సీఎల్ సిమెంట్స్,నేడు మై హోం సిమెంట్స్ వంతు.సున్నపురాయి మైనింగ్ పై పెద్ద ఎత్తున అక్రమాలు బయటపడుతున్నాయి.గతేడాది ఫారెస్ట్ భూముల్లో అక్రమ మైనింగ్ పాల్పడ్డందుకు పాలకవీడు మండలంలోని డెక్కన్ సిమెంట్ సంస్థకు రూ.25 కోట్ల వరకు మైనింగ్ శాఖ జరిమానా విధించింది.ఇటీవల మఠంపల్లి మండలంలోని ఎన్సీఎల్ సంస్థకు మైనింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను రూ.90 కోట్ల వరకు జరిమానా పడింది.ఇప్పుడు మేళ్లచెరువు పరిధిలోని మైహోం సిమెంట్స్ అక్రమ సున్నపురాయి మైనింగ్ కార్యకలాపాలు బట్టబయలైతున్నాయి.చౌటపల్లి,వేపలమాదారం గనిలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి,పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

 Mining Without Environmental Clearances-TeluguStop.com

పర్యావరణ అనుమతుల నిబంధనలను ఉల్లంఘించి,అక్రమ మైనింగ్ చేసినందుకు మైహోం సంస్థకు పెద్ద ఎత్తున రూ.వందల కోట్లల్లో జరిమాన పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు ఇప్పటికే విచారణ పూర్తి చేసినట్లు సమాచారం.మైనింగ్ సంస్థలే కాకుండా పర్యావరణ నష్టానికి పాల్పడ్డట్టు ఇప్పటికే గుర్తించిన కాలుష్య నియంత్రణ మండలి మైహోం సంస్థపై కోర్టులో కేసులు దాఖలు చేశాయి.

పర్యావరణ అనుమతుల ఉల్లంఘన కేసులో జరిమానాతో పాటు,శిక్ష తప్పదని తెలుస్తుంది.అదేవిధంగా అక్రమ మైనింగ్ పై రూ.కోట్లల్లో అపరాధ రుసుము చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.మైనింగ్ కార్యకలాపాల వల్ల ప్రభుత్వానికి వచ్చే రాయల్టీతో స్థానిక గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు,చేపడుతున్నామని సిమెంట్ కంపెనీలు, ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాయి.

అయితే అదే సిమెంట్ సంస్థలు అక్రమ మైనింగ్ కు పాల్పడితే చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.మైనింగ్ రాయాల్టీ ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సమకూరే నిధులను గ్రామపంచాయతీలల్లో నిబంధనల ప్రకారం ఖర్చు చేయడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్,పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి పర్యావరణానికి నష్టం కలిగిస్తున్న సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని ప్రభావిత గ్రామపంచాయతీల ప్రజలు వేచి చూస్తున్నారు.అక్రమ మైనింగ్,పర్యావరణ నష్టంపై అపరాధ రుసుము ద్వారా వచ్చే డబ్బును స్థానిక గ్రామపంచాయతిల అభివృద్ధికి ఖర్చు చేయాలని ఆయా పర్యావరణ ప్రభావిత గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈసీ ఉల్లంఘించి సున్నపురాయి మైనింగ్, సిమెంట్ ఉత్పత్తి కార్యకలాపాలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్,ఫారెస్ట్ క్లియరెన్స్, సిఎఫ్ఈ,సిఎఫ్ఓ,మైనింగ్ ప్లాన్ నిబంధనల మేరకు నిర్వహించాల్సి ఉంటుంది.ఏ ఒక్క నిబంధనలను ఉల్లంఘించినా పర్యావరణ నష్టం వాటిల్లుతుంది.

ఈసీ ఉల్లంఘన,పర్యావరణ నష్టంపై పెద్ద ఎత్తున జరిమానా విధించే అధికారం ఇటు పర్యావరణ శాఖకు,మైనింగ్ శాఖకు ఉంటుంది.అయితే మైహోమ్ సిమెంట్ పరిశ్రమ సంబంధించిన చౌటపల్లి మైన్స్ ద్వారా 262 హెక్టార్లో సున్నపురాయి తవ్వకాలు జరుపుతున్నారు.2005 నుండి చౌటపల్లి మైన్స్ వాడుకలో ఉంది.2007 వరకు 46 హెక్టార్లలో సున్నపురాయి తవ్వకానికి మైనింగ్ అనుమతులు ఉండగా 2008 నుండి మరో 216హెక్టార్లకు ఈసి పొంది పూర్తి 262 హెక్టార్లలో చౌటపల్లి మైన్స్-I విస్తరించి ఉంది.ఈ మైన్స్ నుండి ఏడాదికి 10 లక్షల టన్నుల సున్నపురాయి తవ్వకానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పర్యావరణ అనుమతులు జారీ చేశారు.అయితే 2007-08 సంవత్సరం గాను 10 లక్షల టన్నులు మైనింగ్ కు ఈసీ అనుమతులు ఉండగా,ఈసీ అనుమతిని ఉల్లంఘించి 12,83,500 టన్నుల అధిక సున్నపురాయి తవ్వకాలు అక్రమంగా జరిపారు.

ఇటీవల అక్రమ మైనింగ్ పై విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థలు ఈసి ఉల్లంఘించి సుమారు 3 లక్షల టన్నుల వరకు అదనంగా అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు.ఈసి ఉల్లంఘించి,అక్రమంగా జరిపిన మైనింగ్ పై చర్యలు తీసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి.

వేపలమాదారం సున్నపురాయి గనిని మైహోం సంస్థ 2002 నుండి నిర్వహిస్తుంది.వేపలమాదారం గని విస్తీర్ణం 121 హెక్టార్లకు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి పర్యావరణాన్ని అనుమతులు ఆ సంస్థ పొందింది.

ఈ గనిలో 30 హెక్టార్ల అటవీ భూమి ఉంది.ఎటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోకుండా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

ఫారెస్ట్ భూమి ఉన్నట్లు నిర్ధారించుకున్న మైహోమ్ సంస్థ 2014లో 30హెక్టార్ల ఫారెస్ట్ భూమి తన మైనింగ్ లీజు నుండి ఉపసంహరించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించింది.అయితే 2002 నుండి 2014 వరకు ఎటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో మైహోం సంస్థ మైనింగ్ నిర్వహించింది.

ఎటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా 12 సంవత్సరాలు రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో మైనింగ్ నిర్వహించినందుకు గాను పూర్తి వేపలమాదారం మైన్స్ చట్టవిరుద్ధమని కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 02-08-2017సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మైహోం సంస్థపై చర్యలు తీసుకోవాలని స్థానిక న్యాయవాది కమతం నాగార్జున, భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు.రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో అక్రమ మైనింగ్ నేరనిరూపణ అయితే రూ.వందల కోట్ల జరిమాన మైహోం సంస్థకు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.మైహోం మైనింగ్ నిలిపివేత-పర్యావరణ అనుమతుల నిబంధనలను ఉల్లంఘించిన మైహోం సిమెంట్స్ పరిశ్రమకు సంబంధించిన చౌటపల్లి మైన్స్ పై ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి-ప్రభుత్వం తరఫున కేసు నమోదు చేశాయి.

చౌటపల్లి మైన్స్ నుండి సున్నపురాయి తవ్వకాన్ని నిలిపివేశారు.తదానానుగుణంగా మైన్స్ పై ఆధారపడి నడుస్తున్న మైహోం సిమెంట్స్ యూనిట్-3 సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది.వేపలమాదారం మైన్స్ ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా పెద్ద ఎత్తున మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించారు.పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై విచారణ నేపథ్యంలో మైన్స్ పర్యావరణ అనుమతులు రెన్యువల్ కాలేదు.22-02-2022 తేదీ నుండి పర్యావరణ క్లియరెన్స్ లేక మైన్స్ నుండి సున్నపురాయి తవ్వకం పూర్తిగా నిలిచిపోయింది.నూతనంగా చేపట్టిన మైహోమ్ సిమెంట్ యూనిట్-4 పర్యావరణ అనుమతుల ఉల్లంఘన,రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నుండి అనుమతి లేకుండా చేపడుతున్న నిర్మాణాలను ప్రభుత్వ యంత్రాగాం నిలిపివేసింది.

అధికారికంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మైహోమ్ సిమెంట్స్ కార్యకలాపాలను నిలిపివేసినప్పటికీ,అనధికారికంగా దొడ్డిదారిన మైనింగ్,ఇతర నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలుస్తుంది.ఈసీ ఉల్లంఘనలపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన దర్యాప్తు సంస్థలు చర్యలకు సిద్ధమవుతున్నారు.

అక్రమ మైనింగ్ పై రూ.వందల కోట్ల జరిమానా విధించే అవకాశం ఉంది.దొడ్డి దారిన మైనింగ్,ఇతర పనులు చేపట్టినా సదరు సంస్థలు వాటికి లెక్కలు చూపించాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో దొడ్డిదారిన నిర్వహించే పనులకు సైతం పెద్ద ఎత్తున జరిమానా విధించే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పర్యావరణ నష్టం, అక్రమమైనింగ్ పై జరిమానాల ద్వారా వచ్చే రూ.కోట్ల రూపాయల రుసుమును స్థానిక గ్రామపంచాయతీల అభివృద్ధి ఖర్చు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.పర్యావరణ అనుమతుల్లో పేర్కొన్న నిబంధన మేరకు ప్రాజెక్టు పూర్తి వ్యయంలో 5% నిధులను స్థానిక గ్రామ పంచాయతీల అభివృద్ధి ఖర్చు చేయాలి.2%సిఎస్ఆర్ నిధులను ఖర్చు చేయ్యాలి.పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ హామీల్లో పేర్కొన్న విధంగా స్థానిక యువతకు ఉద్యోగాలు,విద్య,వైద్యం అత్యవసర సేవలకు నిధులు కేటాయించాలి.ఈసి నిబంధనలను పరిశ్రమలు ఉల్లంఘిస్తున్నాయని మేళ్లచేర్వు సర్పంచ్ శంకర్ రెడ్డి తెలిపారు.

ఈసీ ఉల్లంఘణపై కోర్టులో కేసు దాఖలు చేసాం-సురేష్ బాబు పర్యావరణ ఇంజనీర్ (ఈఈ) నల్గొండ.మైహోమ్ సిమెంట్స్ ఈసీ ఉల్లంఘించినట్లు మాదృష్టికి వచ్చింది.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ సంస్థలు ఆదేశాల మేరకు స్థానిక కోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది.కోర్టు ఉత్తర్వులు మేరకు జరిమానా విధించడం జరుగుతుంది.

అక్రమ మైనింగ్ పై మైనింగ్ సంస్థలు జరిమానా విధిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube