సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల కేంద్రం నుండి కొత్తగూడెం( Kothagudem ) వెళ్ళే ప్రధాన రహదారిపై కంకర, డస్ట్ పరిచి ఏడాది గడుస్తున్నా బీటీ వేయకుండా కాంట్రాక్టర్ అలసత్వం వహిస్తుంటే, పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కొత్తగూడెం నుండి నిత్యం ఏదో ఒక పనిమీద గొండ్రియాలకు, మండల కేంద్రానికి,పొలాల వద్దకు వెళ్లేవారు కంకరపై ప్రయాణిస్తూ,డస్ట్ బారిన పడుతూ నరకం చూస్తున్నారు.
సంబంధిత అధికారుల,కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని స్థానిక ప్రజలు ప్రభుత్వ నిర్లక్ష్యమని భావిస్తున్నారు.ప్రభుత్వ లక్ష్యానికి సదరు కాంట్రాక్టర్ తూట్లు పొడుస్తుంటే, చర్యలు తీసుకోవల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.
దీనితో స్థానిక ఎమ్మెల్యేకు కాంట్రాక్టర్,అధికారులు మచ్చ తెచ్చే విధంగా తయారయ్యారని స్థానికనేతలు ఆరోపిస్తున్నారు.కొత్తగూడెం మండల కేంద్రానికి దూరంగా ఉండడం,ఆంధ్రాకు సరిహద్దు గ్రామం కావడం వలన ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని గ్రామస్తులు అంటున్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బీటి రోడ్డు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.