సూర్యాపేట జిల్లా:కల్లుగీత కార్మికులందరికీ మోటర్ బైకులు ఇవ్వాలని,గీత కార్మికుల ఉపాధికై కుటుంబానికి పది లక్షల రూపాయల చొప్పున “గీతన్న బంధు”ఇవ్వాలని కల్లు గీత కార్మిక సంఘం(కెజికెఎస్) సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.సోమవారం చివ్వెంల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు కెజికెఎస్ మండల కమిటీ అధ్వర్యంలో కల్లు గీత కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం తహశీల్దార్ రంగారావుకి మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల కోసం గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా మోటర్ బైకులు ఇవ్వాలని అన్నారు.50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులకు గత నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న పెన్షన్ ని వెంటనే విడుదల చేయాలని, వృత్తిలో ప్రమాదం జరిగిన వారికి ఇవ్వాల్సిన ఎక్స్ గ్రేషియా వెంటనే కల్పించాలన్నారు.తాడి కార్పొరేషన్ కు కేటాయించిన బడ్జెట్ వెంటనే విడుదల చేసి గీత కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలన్నారు.
గీత కార్మికుల ఉపాధికై కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున “గీతన్న బంధు” ఇవ్వాలని అన్నారు.అలాగే ప్రతి సొసైటీకి చెట్ల పెంపకానికి ఐదు ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని,చివ్వెంల మండల కేంద్రంలో నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసి యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు ఉయ్యాల నగేష్ మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల స్థానిక సమస్యలు పరిష్కరించాలని,తాటి చెట్లు నరికిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని,గీత కార్మికులందరికీ సభ్యత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.
ప్రతి సొసైటీకి ఇచ్చిన విధంగానే గౌడ్ లకు కూడా కమ్యూనిటీ భవనాలు నిర్మించి ఇవ్వాలని,గీత కార్మికుల పిల్లలకు ఉచిత విద్య,వైద్యం కల్పించాలని డిమాండ్ చేశారు.శీతల పానీయాలు,బెల్ట్ షాపులు రద్దు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జెర్రిపోతుల కృష్ణయ్య,జిల్లా కమిటీ సభ్యులు ధోనేటీ పిచ్చయ్య,సిగ నర్సయ్య,రవి బెల్లంకొండ హనుమంతు,వీరయ్య,జెర్రిపోతుల నాగరాజు, వేములకొండ లక్ష్మయ్య,అమరగాని వీరయ్య,సిగ సైదులు,సుధగాని వీరయ్య,బూర లింగయ్య, వల్లపుదాసు కోటయ్య,అర్జున్,శ్రీరాములు,నరసయ్య, వెంకన్న,సైదులు,వెంకటాద్రి,సతీష్,ఆంజనేయులు, గురుమూర్తి,వెంకటేశం,శ్రీకాంత్,జానయ్య,వెంకటేష్, గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.