సూర్యాపేట జిల్లా:దేశంలోని రాజకీయ పార్టీలు కుల,మత రాజకీయాలను ప్రోత్సహించడం మానుకొని నూతనంగా నిర్మించే పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీ.ఆర్.
అంబేద్కర్ పేరు పెట్టేందుకు ముందుకు రావాలని మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకన్న జిల్లా అధ్యక్షులు అశోద రవి పిలుపునిచ్చారు.పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక రైతు బజార్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాలమహానాడు జిల్లా అధ్యక్షులు అశోద రవి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి,సిఎం కెసిఆర్ మంత్రి జగదీష్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల తాము రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని కలసి పార్లమెంట్ భవనానికి బీ.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని కోరడంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో తీర్మానం చేసేలా చేయడం హర్షణీయమన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ అంబేద్కర్ వంటి మహనీయుడి పేరు పార్లమెంట్ భవనానికి పెడతామంటే మాకెలాంటి అభ్యంతరం లేదనటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలోని రాజకీయ పార్టీలు మతాలు,కులాలను ప్రోత్సహిస్తూ విభజనకు పాల్పడటం సరికాదన్నారు.దేశానికి మూలవాసుల ఆరాధ్య దైవం అంబేద్కర్ పేరు పార్లమెంట్ భవనానికి పెట్టేందుకు బిజెపి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు.
అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు రిక్రూట్మెంట్లో కటాఫ్ 20 మార్కులను ఎస్సీలకు కలపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని శాసనమండలిలో లేవనెత్తిన ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.
అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని గతంలో పట్టాలు పొందిన దళితులకే భూమి వర్తించేలా చట్టం చేయాలన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ దళిత బంధు తో వారి అభివృద్ధికి పాటుపడుతుందన్నారు.
దళితులు ఎక్కువగా ఉన్న సూర్యాపేటలో 60 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మంత్రి జగదీశ్ రెడ్డిని కోరగా సానుకూలంగా స్పందించారని అన్నారు.అలాగే గ్రామగ్రామాన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మాలమహానాడు కృషి చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట మురళీ,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గాజుల రాంబాయమ్మ,రాష్ట్ర కార్యదర్శి అనుముల పూరి శ్రీనివాస్,జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల రమేష్,జిల్లా కార్యదర్శి బొల్లెద్దు వెంకటేశ్వర్లు,ప్రసాద్, మద్దెల రాము,కంచె సరిత,రాయిరాల జానయ్య, దోమల రమణయ్య,వాసా నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.







