సూర్యాపేట జిల్లా : వేసవి కాలం వచ్చిందంటే గ్రామీణప్రాంతాల్లో చెరువులపై మట్టి మాఫియా వాలిపోతుంది.నాణ్యమైన మట్టి కనిపిస్తేచాలు వెంటనే జేసీబీలు దించి తవ్వకాలు చేపట్టి,అక్రమ మట్టి రావణాతో చెలరేగిపోతారు.
వీరి మట్టి దాహానికి చెరువులు మాత్రమే కాదు.ప్రభుత్వ,అటవీ భూములు,గుట్టలు,చివరికి ప్రైవేట్ భూములు కూడా కరిగి పోవాల్సిందే.
గత ప్రభుత్వ హయంలో అడ్డూ అదుపూ లేకుండా గుట్టలు,చెరువులను చెరబట్టిన మట్టి మాఫీయా అక్రమ మట్టి వ్యాపారంతో కోట్లకు పడగలెత్తారు.ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.స్థానిక ఎమ్మెల్యే కూడా మారి అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవిలోకి వచ్చారు.
ఇక నియోజకవర్గంలో మట్టి, ఇసుక వంటి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని ఆశించారు.కానీ,కోదాడ నియోజకవర్గ పరిధిలో మట్టి మాఫీయా మళ్ళీ జడలు విప్పింది.గతంలో లాగానే సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయిలసింగారం రిజర్వాయర్ లో యధేచ్చగా మట్టి తవ్వకాలు షురూ చేశారు.వర్షాభావ పరిస్థితుల్లో చెరువు ఎండిపోవడంతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెరువులో పూడిక తీసి కట్టమీద మట్టి పోయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
దానికి సంబంధించి అధికారుల నుండి ఎలాంటి అనుమతులు రాకుండానే మంత్రి ఆదేశాలను ఆసరాగా చేసుకుని అక్రమ మార్గంలో తవ్వకాలు చేపట్టి మట్టిని కట్టపై పోయకుండా బయటికి తరలిస్తున్నారని, చెరువులో పెద్ద పెద్ద బావులను తలపించే విధంగా కందకాలు పెడుతూ మట్టి వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ పెద్ద మొత్తంలో అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
అధికారులు వచ్చేసరికి పనులు నిలిపేసి,వారు వెళ్లగానే వెంటనే తిరిగి మట్టి తవ్వకాలు జరుపుతున్నారని అంటున్నారు.
మట్టి తవ్వకాలు జరిగిన ఆనవాళ్లు ఉన్నా అధినరులు కనీసం గ్రామంలో విచారణ చేయకుండా రాలేదనకుంటా వచ్చి పోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక్కడే కాదు అనంతగిరి మండలంలో మట్టి మాఫీయా మళ్ళీ తమ కార్యకలాపాలు షురూ చేసింది.
కిష్టాపురం,గోండ్రియాల,వాయిల సింగారం,పాలవరం గ్రామాల్లోని చెరువుల్లో అక్రమ మట్టి వ్యాపారం జోరుగా సాగుతుంది.అయినా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో మట్టిమాఫీయాతో అధికారులు చేతులు కలిపి అక్రమార్జనకు తెరలేపారా అనే సందేహం మండల ప్రజల్లో వ్యక్తమవుతుంది.
ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సంప్రదించగా రేస్బాండ్ కాకపోవడం గమనార్హం.ఇప్పటికైనా అధికారులు స్పందించి మండలంలో అనుమతులు లేకుండా జరుగుతున్న మట్టి వ్యాపారంపై ఉక్కుపాదం మోపి,అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.