భారతదేశాన్ని హైందవదేశంగా కొంతమంది పేర్కొంటారు.దానికి కారణం ఒక్కటే.
ఇక్కడ అత్యధిక శాతం హిందువులే ఉండటం.అందువలన భారతదేశం ఎన్నో ఆలయాలు, పుణ్యక్షేత్రాలకు పెట్టింది పేరు.
ఇక దేశంలో దర్శనీయ పుణ్యక్షేత్రాలలో చాలామంది ఎక్కువగా చెప్పేది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి.ఈ 2022లో ప్రజలకు అత్యంత ఇష్టమైన తీర్థయాత్ర గమ్యస్థానంగా వారణాసి నిలిచింది.
ఈ విషయాన్ని ఓయో కల్చరల్ ట్రావెల్ 2022 రౌండప్ రిపోర్ట్ తెలియజేసింది.ఇక ఆ తరువాత తెలుగు వారి కలియుగదైవం తిరుమల తిరుపతి సైతం భక్తుల గమ్యస్థానంగా నిలవడం విశేషం.
ఇకపోతే ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టులో తిరుపతి రెండో స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం.ఆ తరువాత వరుసగా ఒడిశాలోని పూరీ, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్, పంజాబ్ లోని అమృత్‌సర్‌లను కూడా అత్యధిక ప్రజలు దర్శించారని సమాచారం.
అంటే టాప్ 5 స్థానాల్లో ఇవి నిలిచాయని ఓయో నివేదికలో పేర్కొన్నారు.అంతేకాకుండా మహారాష్ట్రలోని షిర్డీ, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, ఉత్తరాఖండ్ లోని రిషికేశ్, మహాబలేశ్వర్ (మహారాష్ట్ర)లతో పాటు తమిళనాడులోని మధురై కూడా భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలలో నిలిచాయి.
కరోనా వలన గత రెండు సంవత్సరాలలో లేనంత విధంగా ఈ ఏడాది ఆయా ఆధ్యాత్మి పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని భోగట్టా.సహజంగా వారణాసి హిందువులు మరియు బౌద్ధులు ఇద్దరికీ ప్రధాన తీర్థయాత్ర కేంద్రాలలో ఒకటి కాబట్టి మొత్తం భారతదేశంలోని మతపరమైన పర్యాటక ప్రదేశాల కంటే దీని ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది.ఈ సంవత్సరం పండుగ సీజన్‌కు ముందు, గ్లోబల్ హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్ OYO దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక, పర్యాటక ప్రయాణం, దర్శనీయ స్థలాల వివరాలు సేకరించింది.ఈ క్రమంలోనే ఈ విషయాలు బయటకు వచ్చాయి.