సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ కోతలపై రైతులు నిరసనలు చేస్తుంటే పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి రైతుల పట్ల అవమానకరంగా మాట్లాడడం,చెప్పుడు మాటలు విని రోడ్ల మీదకు వస్తే కేసులు పెడతారని బెదిరించడం,24 గంటల కరెంట్ ఇస్తున్నామని,ఇది ప్రతిపక్షాల కుట్ర అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని గరిడేపల్లి మండలం కల్మలచెరువు రైతులు ఎద్దేవా చేశారు.రాష్ట్ర ప్రభుత్వం,ఎమ్మెల్యే చెబుతున్నట్లుగా 24 గంటల విద్యుత్ రావడంలేదని బుధవారం కల్మలచెరువు సబ్ స్టేషన్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు.
అనంతరం వారు మాట్లాడుతూ పొలాలు పొట్ట దశలో ఉన్నాయని,కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, కరెంట్ అడిగితే సిగ్గు లేకుండా మా ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తుందని,ఇది ప్రతిపక్షాల కుట్రని అనేవారు కరెంట్ తీగలు పట్టుకోవాలని సూచించారు.ఇప్పటికైనా ఏతులు మానుకొని,కరెంట్ కోతలు లేకుండా చూసి, రైతులను ఆదుకోవాలని కోరారు.
ప్రభుత్వానికి ఏదైనా బుకాయించటం అలవాటుగా మారిందని, 24 గంటల కరెంట్ సరఫరాపై రైతులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.