సూర్యాపేట జిల్లా: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం( BJP government ) మతం పేరుతో ప్రభుత్వ ఆస్తులు అమ్ముతుందని ఇదేమిటని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ అన్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సామాన్యుడి సమరభేరి కార్యక్రమంలో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా( Suryapet district ) కేంద్రంలోని తిరుమల గ్రాండ్ లో ఏర్పాటు చేసిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ దేశంలోఎన్నో వనరులు ఉన్నా పేదరికం పెరుగుతుందని,ఇందుకు కారణం అవినీతి అని, దాన్ని సమూలంగా నిర్మించేందుకు ఆప్ ఆవిర్భవించిందన్నారు.
నలుగురితో మొదలైన ఆప్ కోట్లాది మందితో నేడు రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి జాతీయ పార్టీగా ఎదిగిందన్నారు.ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వాలకు ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఉంటుందన్నారు.
ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారని ప్రశ్నించినందుకు ఢిల్లీలో ఆప్ మంత్రులు సిసోడియ,సత్యేందర్ సింగ్ లపై దాడులు చేయించి ఒక్క రూపాయి పట్టుకోకున్న వారిని అక్రమంగా జైల్లో పెట్టారని ఆరోపించారు.సామాన్యుల కోసం పోరాడే వారిని జైల్లో పెట్టిన భయపడేది లేదని ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదన్నారు.
ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలైన ఉచిత విద్య, వైద్యం కోసం ఆప్ శక్తివంచన లేకుండా పోరాడుతుందన్నారు.అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్,మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని,ఉచిత బస్సుల్లో మహిళా ప్రయాణికులకు రక్షణ కల్పించాలని తీర్మానం చేశారు.
అంతకుముందు రైతు బజార్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సమావేశంలో పలువురు అప్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో ఆప్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి సూరారపు పరీక్షన్ రాజు,రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్,జిల్లా అధ్యక్షుడు ఇందారపు రాజమల్లయ్య,మహిళా అధ్యక్షురాలు మమత, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కూతుబుద్దిన్,మహిళ నాయకురాళ్లు అనూష, నవ్య, పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.