సూర్యాపేట జిల్లా:ఆర్థిక ఇబ్బందులు తాళలేక, అప్పులు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక తీవ్ర మనస్థాపానికి గురైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీ నగర్ లో గురువారం చోటుచేసుకుంది.మృతుని కుమారుడు, పోలీసులు కథనం ప్రకారం మునగాల మండలం విజయరాఘవాపురం గ్రామానికి చెందిన గోదేశి నరేంద్రబాబు(55)గుంజులూరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ సూర్యాపేటలోని శ్రీశ్రీ నగర్ లో నివాసం ఉంటున్నారు.
కారణాలు ఏమిటో తెలియదు కానీ,తెలిసిన వారివద్ద,బంధువుల దగ్గర 30 నుండి 40 కోట్ల వరకు భారీ మొత్తంలో అప్పులు చేసినట్లు తెలుస్తోంది.అయితే అప్పులు ఇచ్చినవారు గత కొద్దిరోజులుగా తమ అప్పులు తీర్చాలని నరేంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి చేయడంతో సమాధానం చెప్పలేక మనస్థాపానికి గురై గురువారం రాత్రి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
తండ్రి నరేంద్రబాబు కొద్దీ రోజులుగా అప్పులవారికి సమాధానం చెప్పలేక తీవ్రంగా బాధపడతూ ఉండేవాడని,బుధవారం రాత్రి భోజనం చేసి బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడని, తెల్లవారుజామున తన తల్లి వెళ్లి చూసేసరికి ఫ్యాన్ కి ఉరివేసుకొని వ్రేలాడుతూ కనిపించడంతో వెంటనే గట్టిగా నన్ను పిలవడంతో వెళ్లి చూసేసరికి అప్పటికే చనిపోయినట్టు కొడుకు చెబుతున్న మాట.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతుని కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాకూబ్ తెలిపారు.అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
అప్పులు తీర్చనిదే అంత్యక్రియలు జరగనివ్వం అంత్యక్రియలు అడ్డుకున్న బాధితులు.ఇదిలా ఉంటే పోస్ట్ మార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించడం కోసం మృతుని స్వగ్రామం విజయరాఘవాపురం గ్రామానికి మృతదేహాన్ని తరలించగా విషయం తెలుసుకున్న నరేందర్ కి అప్పులిచ్చిన వారు అక్కడికి చేరుకొని తమ అప్పులు తీర్చనిదే అంత్యక్రియలు జరగనివ్వమని అడ్డుకోవడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.నరేంద్రబాబుకు తెలిసిన వారు,బంధువుల దగ్గర సుమారు 30 నుంచి 40 కోట్ల వరకు అప్పులు చేసినట్లు తెలుస్తోంది.
తమ అప్పుల విషయం తెలే వరకు శవాన్ని కదలనిచ్చేది లేదని కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు.పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీనితో మునగాల ఎస్ఐ బాలు నాయక్ నేతృత్వంలో పోలీసులు హుటాహుటిన భాదితులకు ఘటనా స్థలానికి చేరుకొని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.అయినా బాధితులు ససేమిరా అనడంతో కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది.
గందరగోళ పరిస్థితుల నడుమ మృతుని అంత్యక్రియలు నిలిచిపోయాయి.మాట్లాడుకున్నాక దహన సంస్కారాలు నిర్వహించుకోవాలని పోలీసులు సూచించడంతో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు సమాచారం.
దీనితో నరేందర్ అంత్యక్రియలు నేడు జరగనున్న నేపథ్యంలో గ్రామంలో ఉత్కంఠ నెలకొంది.