సూర్యాపేట జిల్లా: జిల్లాలోని నెరేడుచర్ల మున్సిపాలిటీ ముసలం ముదిరి పాకాన పడుతుంది.మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబుపై అవిశ్వాసానికి అనుమతి ఇవ్వాలని,అవిశ్వాస తీర్మాన ప్రతిని కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది కౌన్సిలర్లు కలెక్టర్ కి అందజేసిన విషయం తెలిసిందే.
తాజాగా శనివారం బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురేసిన ముగ్గురు కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ను కలిసి అవిశ్వాసానికి అనుమతి ఇవ్వాలని కోరడంతో మున్సిపల్ అధికార మార్పిడి జరిగే అవకాశం ఉన్నట్లు జోరుగా చర్చ జరుగుతుంది.
దీనితో కలెక్టర్ అవిశ్వాస తీర్మాన ప్రతిని పరిశీలించి, తదుపరి సంబంధిత మున్సిపల్ కమిషనర్ కి పంపిస్తూ,కౌన్సిలర్ల సంతకాలు పరిశీలన అనంతరం మున్సిపల్ చట్టంలోని నిబంధనల మేరకు తదుపరి చర్యలకై హుజూర్ నగర్ రెవెన్యూ డివిజనల్ అధికారికి సూచించారు.ప్రస్తుతం నేరేడుచర్ల మున్సిపల్ వ్యవహారం చూస్తుంటే త్వరలోనే చైర్మన్ గిరిని హస్తం పార్టీ హస్తగతం చేసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.