సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండలం( Nadigudem )తెల్లబల్లి సొసైటీలో పనిచేసే ఇద్దరు సిబ్బంది చేతివాటంతో తన కుటుంబం ఇబ్బంది పడుతుందని తెల్లబల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు( Female farmer ) భర్త,రిటైర్డ్ ప్రిన్సిపల్ కొల్లు గోవిందరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జరిగిన విషయాన్ని ఆయన మీడియాకు వివరిస్తూ అనంతగిరి మండలం వాయిల సింగారం, నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామాలను కలిపి పీఏసీఎస్ కేంద్రంగా ఏర్పాటు చేశారు.
అందులో నా భార్య ధనలక్ష్మి పేరుమీదున్న భూమి పట్టాలు పెట్టి లోన్ తీసుకుని,అవి చెల్లించి పట్టా బుక్ ఇవ్వమంటే మీ అప్పు ఇంకా ఉందని చెప్పడంతో షాకయ్యామని వాపోయారు.మేము తీసుకున్న లోన్ కు అదనంగా అందులో పనిచేసే ఇద్దరు సిబ్బంది కలిసి రూ.60 వేలు ఋణం తీసుకొని తమ సొంతానికి వాడుకున్నారని, 2017 మార్చి నెలలో ఈ సంఘటన జరిగితే 2023 సెప్టెంబర్ లో మాకు తెలిసిందన్నారు.
ఈ దొంగ ఋణం విషయంలో సొసైటీ అధికారులు మొండి బకాయిల జాబితాలో మా భార్య పేరు ప్రకటించి,నా కుటుంబ పరువుకు నష్టం కలిగించారన్నారు.
నా కూతురు వివాహం కోసం పొలం అమ్మడానికి ప్రయత్నం చేస్తే,తప్పుడు ఋణ సమస్య కారణంగా ఎవరు ముందుకు రావడం లేదన్నారు.సొసైటీ చైర్మన్, ఇరు గ్రామాల సర్పంచ్లకు విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం దక్కలేదన్నారు.
ఉన్నత చదువులు చదివి, ప్రభుత్వ ఉద్యోగిగా రాష్ట్ర ప్రభుత్వం( State Govt ) ద్వారా రెండుసార్లు ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు పొందిన నాకే ఇంత అన్యాయం జరిగితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.