సూర్యాపేట జిల్లా:అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడతామని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎనిమిదేళ్లు అయినా నేటికీ ఎలాంటి కార్యాచరణ రూపొందించకుండా మాదిగలను మోసం చేస్తుందని ఎమ్మార్పీఎస్-టీఎస్ సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి పడిదల రవి కుమార్ మాదిగ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో ఎమ్మార్పీఎస్-టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.అగ్నిపథ్ పేరుతో సైన్యాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుందని ఆరోపించారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు.బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టకుంటే బీజేపీని గ్రామాలలో తిరగనీయమని హెచ్చరించారు.
దేశంలో మోడీ పాలనలో దళితులపై రోజురోజుకీ దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మార్పీఎస్-టీఎస్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణకు గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నామని తెలిపారు.
దళిత విద్యార్థులు ఆదుకునేందుకు మెరుగైన స్కాలర్షిప్లను అందజేయాలని,రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందజేయాలని డిమాండ్ చేశారు.త్వరలోనే ఎమ్మార్పీఎస్-టీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్-టీఎస్ జిల్లా మహిళా నాయకురాలు మామిడి శోభ,సూర్యపేట పట్టణ అధ్యక్షుడు పరశురాం,చివ్వెంల మండలాధ్యక్షుడు నాగరాజు,పెన్ పహాడ్ మండలాధ్యక్షుడు నెమ్మాది బాబు,ఆత్మకూర్ (ఎస్) మండలాధ్యక్షుడు ఉమేష్,మొండికత్తి ఎల్లయ్య, శ్రావణ్,రాము,వెంకన్న,సాయి,వెంకటేశ్వర్లు, రోహిత్,బన్నీ,సంపత్,శ్రీకాంత్,మంజు తదితరులు పాల్గొన్నారు.