సూర్యాపేట జిల్లా: శాసనసభలో సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క ను అవమానించడం బాధాకరమని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు తీవ్రంగా ఖండించారు.ఆత్మకూర్ (ఎస్)మండలం నెమ్మికల్ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ ఆద్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ శాసనసభలో సిఎల్పి నాయకుడు మల్లు భట్టి విక్రమార్క పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే, వినకుండా భట్టిని అవమానించడం అనేది స్పీకర్ కు తగదని,ఇది అత్యంత బాధాకరమని మండిపడ్డారు అప్రజాస్వామికంగా,నిబంధనలకు విరుద్ధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం శాసన సభను నడుపుతుందని,ఇది ఒకరకంగా శాసన వ్యవస్థను అవమానించినట్లేనని అన్నారు.
పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే స్పీకర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.సభలో సభ్యులను అవమానిస్తూ,వారి సభా హక్కులను హరిస్తూ,నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదినుండి రాజ్యాంగాన్ని,ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా ప్రవర్తించడం పరిపాటిగా మారిందని,కాంగ్రెస్ పార్టీ శాసనభ్యులను అన్యాయంగా టిఆర్ఎస్ లో చేర్చుకోవడం,భారత పవిత్ర రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం,బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రద్దు చేయడం,నిన్న పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తాలనుకున్న సిఎల్పి నాయకుడు మల్లు భట్టి విక్రమార్క పట్ల స్పీకర్ అనుచితంగా ప్రవర్తించడం తదితర విషయాలన్నీ టిఆర్ఎస్ ప్రభుత్వ దమననీతికి ప్రత్యక్ష ఉదాహరణలని తెలిపారు.నిన్న సభ నిర్వహణ తీరు చూస్తుంటే,అది శాసనాలు చేసే శాసనసభనా లేక టీఆర్ఎస్ పార్టీ ఆఫీసా అనే అనుమానం వస్తుందన్నారు.
శాసనసభలో తమకు మద్దతు ఇచ్చే వాళ్లకు మాత్రమే మైక్ ఇచ్చి,తమకు నచ్చని ప్రతిపక్షాల వారికి మైక్ ఇవ్వకపోవడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమన్నారు.కనీస సభా సంప్రదాయాలను కూడా పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
శాసనసభను ఏకపక్షంగా,దుర్మార్గంగా నడుపుతున్నారని, సభ నడుపుతున్న తీరుతెన్నులపై కాంగ్రెస్ పార్టీ అతి త్వరలో రాష్ట్రపతికి లేఖ రాయనున్నామని తెలియజేశారు.కెసిఆర్,స్పీకర్ తమ ఇష్టం వచ్చినట్లు చేస్తామని అనుకుంటే పొరపాటని అదేమీ మీ స్వంత ఇల్లు కాదని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.
కాంగ్రెస్ సభ్యులు కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల్లో గెలిచి వచ్చారనీ,సభ నడిపే తీరు ఇది కాదని సూచించారు.దీనికి భాద్యత ముఖ్యమంత్రి, స్పీకర్,శాసనసభ వ్యవహారాల మంత్రి వహించాలని చకిలం రాజేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తంగెళ్ళ కరుణాకర్ రెడ్డి,మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శిగ శ్రీనివాస్,జిల్లా కాంగ్రెస్ కోశాధికారి పాండునాయక్,మండల ఒబిసి సెల్ అధ్యక్షులు పచ్చిపాల వెంకన్న,నాయకులు ముస్కు రాంచంద్రారెడ్డి,నారగోని లింగయ్య,గోపగాని పెద వెంకన్న,కోన రాజు,కోన అయోధ్య,మూల ఎల్లయ్య, ఇరుగు శ్రీను,ఇరుగు వెంకన్న,బాషపంగు లింగయ్య, జామండ్ల సత్యనారాయణ రెడ్డి,గంపల కరుణాకర్, వీరబోయిన వెంకన్న,మధు,వీరబోయిన సతీష్, భూతం లింగయ్య,యువజన కాంగ్రెస్ నాయకులు రామ్మూర్తి,నాగభూషణం,భరత్ తదితరులు పాల్గొన్నారు.