సూర్యాపేట జిల్లా:ఆత్మకూరు (ఎస్) మండలంలోని ఏపూర్ గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు రేసు రామస్వామి,వెంకటమ్మ ( Race Ramaswamy, Venkatamma )కుమారుడు యాకస్వామి పేదరికాన్ని జయించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రామస్వామి,వెంకటమ్మ దంపతులకు నలుగురు సంతానం.
రామనరసమ్మ,శ్రీనివాస్,సునీత, యాకస్వామి.అక్క రామనరసమ్మకు అప్పటికే వివాహమవగా,బాల్యం లోనే తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో మిగతా ముగ్గురు అనాధలయ్యారు.చేరదీసేవారు ఎవరూ లేకపోవడంతో విషయం తెలుసుకున్న యం.వి.ఫౌండేషన్ వారు ప్రాథమిక విద్యాభ్యాసానికి సహకారం అందించి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ చేర్చారు.సంక్షేమ హాస్టల్ల లో ఉంటూ పాఠశాల విద్య పూర్తి చేసినా,పైచదువులు భారం అవటంతో, ఎలాగైనా తమ్ముడు, చెల్లెలుని చదివించాలని అన్న శ్రీనివాస్ నిర్మాణ రంగ కార్మికుడుగా మారారు.
పెద్దల సలహాతో చెల్లెలు పెళ్లి చేసి,తమ్ముడు యాకస్వామిని చదివిస్తూ వచ్చారు.ఇదిలా ఉండగా రామనర్సమ్మ భర్త మద్యానికి బానిసై తరచూ వేధిస్తుండటంతో,భర్తతో వేగలేక కూతురితో సహా తను సోదరుడు శ్రీనివాస్ దగ్గరకే వచ్చి ఉంటుంది.
గతేడాది రామనర్సమ్మ కాలికి శస్త్రచికిత్స చేసి కాలు తొలగించారు.కుటుంబ పోషణతో పాటు సోదరి ఆస్పత్రి ఖర్చులు తదితరాలు నిర్మాణ రంగ కార్మికుడుగా పని చేస్తున్న శ్రీనివాస్ కు పెనుభారంగా మారాయి.
అయినప్పటికీ ఎక్కడా వెరవకుండా సోదరుడు యాకస్వామి ఉన్నత చదువులకు సహకరిస్తూ వచ్చాడు.మరో వైపు యాకస్వామి ప్రభుత్వ బి.సి.వెల్ఫేర్ హాస్టల్లలో ఉంటూ బి.కామ్ మరియు యం.కామ్ పూర్తి చేశాడు.ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా బ్యాంక్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతూ పలుమార్లు ఇంటర్వ్యూ వరకూ వెళ్లినా విజయం మాత్రం చేరువ కాలేదు.అయినా ఎప్పుడు నిరుత్సాహ పడకుండా స్వయం ప్రేరణతో కుటుంబానికి భారం కాకూడదని హోమ్ ట్యూషన్లు మరియు ప్రైవేట్ లో క్లాసులు చెప్తూ అర్హత ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తూ వచ్చారు.
ఆ ప్రయత్నంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వ అణుశక్తి విభాగం ‘బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ ‘వారి అప్పర్ డివిజన్ క్లర్క్ రెండు దశల నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యారు.ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నపుడు ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నానని, పలుమార్లు ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవని,ఆ సమయంలో తమ కుటుంబ సమస్యలు,తన అన్న పడుతున్న కష్టాలు గుర్తుకు తెచ్చుకుని వదలకుండా సన్నద్ధత కొనసాగించానని యాకస్వామి చెప్పాడు.
కష్టాలను ఎదుర్కోవడంలో తన సోదరుడు శ్రీనివాస్ తనకు రోల్ మోడల్ అని, యం.వి.ఫౌండేషన్ వ్యవస్తాపకురాలు ప్రొ.శాంతాసిన్హా తమ లాంటి ఎందరో అనాధలకు తల్లి లాంటి వారని,యం.
వి.ఫౌండేషన్ కో ఆర్డినేటర్ వెంకటేశం తమను తండ్రిలా ఆదరించారని వారికి ఎప్పుడూ తమ కుటుంబం ఋణపడి ఉంటుందని యాకస్వామి చెప్పారు.ఈ సందర్భంగా తన ఉద్యోగ ప్రయత్నాల్లో సహకరించిన టీచర్ లకు, స్నేహితులకు యాకస్వామి కృతజ్ఞతలు తెలిపారు
.