సూర్యాపేట జిల్లా: మునగాల మండల( Munagala ) పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపిపి యలక బిందు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి( Uttam Padmavathi ) హాజరు కావడంతో వివిధ గ్రామాల సర్పంచులు ఒక్కసారిగా తమ పరిస్థితిని ఎమ్మేల్యే దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నంలో రచ్చ రచ్చ చేశారు.
ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లడుతూ కష్టపడి గ్రామాభివృద్ధి చేసి బిల్లుల కోసం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చేసరికి అధికారులు బిల్లులు కొట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని,ముడుపులు చెల్లిస్తేనే బిల్లులు కొడతామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతీ శాఖలో అవినీతి తాండవిస్తుందని,ఈ అవినీతి అధికారులను మండలం నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt )లో నైనా అధికారుల్లో మార్పు తీసుకువచ్చి ప్రజలకు పారదర్శకమైన పాలన అందేవిధంగా చూడాలని ఎమ్మెల్యేను కోరారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అవినీతి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవినీతికి పాల్పడకుండా ప్రజా ప్రతినిధులకు మరియు ప్రజలకు సహకరించి నియోజకవర్గ అభివృద్ధి అధికారులు కూడా భాగస్వాములు కావాలన్నారు.