సూర్యాపేట జిల్లా:మరణించే వరకు ఉద్యమమే ఊపిరిగా పోరాడిన వీర వనిత మల్లు స్వరాజ్యం అని,అమరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు,మాజీ శాసన సభ్యురాలు,సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటమే ఊపిరిగా పేద ప్రజల పక్షాన నిరంతరం ఉద్యమాలు చేసిన వ్యక్తినే కాకుండా ఒక శక్తిగా చిన్నతనం నుంచి పోరాడుతూ తన జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేశారని కొనియాడారు.
ఉద్యమమే ఊపిరిగా మరణించే వరకు,దోపిడీ దౌర్జన్యానికి వ్యతిరేకంగా ధీశాలి వీర వనితగా ఉద్యమం చేశారని, మరణాంతరం తన అవయవాలు దానం చేసిన ఘనత ఆమెకు దక్కిందని గుర్తు చేశారు.లౌకికవాదానికి విఘాతం కల్గిస్తూ మత ఘర్షణలు జరిగేవిధంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేవిధంగా మతపరమైన ఘర్షణలకు పూనుకుంటుందని అన్నారు.డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర్య భారతావనిలో కార్పోరేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ సామాన్యుల నడ్డి విరిగేవిధంగా భారం మోపుతుందని ఆరోపించారు.
పారిశ్రామిక వేత్తల రుణాలను మాఫీ చేస్తుందని, ఇంధనం ధరలను పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆక్షేపించారు.మతోన్మాద రాజకీయాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
దోపిడీ లేని సమ సమాజాన్ని స్థాపించాలని, సోషలిజం ధ్యేయంగా దాని లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు భావసారుప్య పార్టీలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.
అంతకుముందు పార్టీ శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.దానితో సూర్యాపేట పట్టణం ఎరుపు వర్ణం సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు,సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,మాజీ శాసనసభ్యులు నంద్యాల నర్సింహా రెడ్డి,డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్,సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి,సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,పోతినేని సుదర్శన్ రావు,నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు,ముల్కలపల్లి రాములు,కోట గోపి,మట్టిపల్లి సైదులు,జె.నర్సింహా రావు,బుర్రి శ్రీరాములు,ధనియాకుల శ్రీకాంత్ వర్మ,సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు,ఎంసిపిఐ జిల్లా కార్యదర్శి వరికుప్పల వెంకన్న,న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండాది డేవిడ్ కుమార్,వైఎస్సార్ టిపీ రాష్ట్ర నాయకులు,ప్రజా గాయకులు ఏపూరి సోమన్న,ఏఐకెఎమ్ఎస్ రాష్ట్ర నాయకులు వక్కవంతుల కోటేశ్వరరావు,పాల్గొన్నారు.
మల్లు స్వరాజ్యంపై ఏపూరి సోమన్న,ప్రజా నాట్యమండలి కళాకారులు పాడిన పాటలు సభికులను ఎంతో ఆకట్టుకున్నాయి.