సూర్యాపేట జిల్లా:రాహుల్ గాంధీ బహిష్కరణ వేటు ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటని మాజీ ఎంపీ,మాజీ పిసిసి అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన మాజీ మంత్రి,పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా ఎంపీగా అనర్హత ప్రకటించిందని ఆరోపించారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని,విద్వేషాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరిగి దేశమంతా ఒకతాటిపై ఉండి,దేశాబివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించడం జరిగిందని అన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత ఆ అంశం ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని దేశ వ్యాప్తంగా హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించడం జరిగిందన్నారు.అనేక కార్యక్రమాలతో పాటు ఆదాని యొక్క ఆస్తులు ఏవిధంగా డొల్ల కంపెనీలతో కృత్రిమంగా సృస్టించబడ్డది,దానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏవిధంగా సహకరించింది అనే అంశాల మీది నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు.
ప్రజల సొమ్ము దోపిడీ గురించి రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక భయాందోళనకు గురై నియంత తరహాలో అణిచివేసే ప్రయత్నం మొదలు పెట్టారని విమర్శించారు.పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ 2023 ఫిబ్రవరి 7 న లోక్ సభ సభ్యునిగా సభ సాక్షిగా ఒక ప్రశ్న భారత ప్రధాని నరేంద్ర మోడీని అడగడం,ప్రధాన మంత్రి మీరు ఆదాని ఫ్లైట్ లో వెళ్లి 2014 నుండి ఇప్పటి వరకు పర్యటించిన వివరాలు అంటే ఏ దేశానికి ఆదానిని తీసుకెళ్ళారు? ఎన్ని దేశాల ద్వారా ఆదానికి మీ ద్వారా లబ్ది చేకూరిందనే అంశాలను స్పష్టంగా ఫోటోలతో, పత్రికలతో సహా ఆధారాలు చూపెడితే నరేంద్ర మోడీకి,ఆదానికి డబుల్ ఇంజన్ సర్కార్ కు భయం పుట్టిందని ఎద్దేవా చేశారు.లండన్ లో అక్కడ ఒకరు అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానమిస్తూ మా దగ్గర ప్రజాస్వామ్యిక సమస్యలు ఉన్నాయిని వాటిని మేమే పరిష్కరించుకుంటామని చెపితే,దానికి పార్లమెంట్లో మాట్లాడనివ్వకుండా ఒక కుట్ర పూరితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా 24 మార్చ్ నాడు పార్లమెంట్ నుండి బహిష్కరించడం దారుణమన్నారు.రాహుల్ గాంధీని పార్లమెంట్ నుండి తొలగించడం ద్వారా తమ సమస్య పరిష్కారమవుతుందని మోడీ ప్రభుత్వం భావిస్తుందని,ఈ రోజు మీరు నాశనం చేస్తున్న దేశ ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి గాంధీ కుటుంబం తన రక్తాన్ని చిందించిందని,ఈ కుటుంబం భారత దేశ ప్రజల గొంతులను పెంచిందని,తరతరాలుగా సత్యం కోసం పోరాడిందని, ప్రధానమంత్రి,కేబినేట్ మంత్రులు,మొత్తం వ్యవస్థ కలిసి ఒక వ్యక్తిని కాపాడటానికి ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తున్నరనేది ప్రజలు ఆలోచించాలని అన్నారు.
శ్రీరామనవమి వేడుకలలో నాథురామ్ గాడ్సే ఫోటో పెట్టుకొని ర్యాలీ నిర్వహించడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.ఈకార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ, కిషన్ రావు,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు యండి అంజద్ అలీ,సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి,చివ్వెంల మండల పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ వేములకొండ పద్మ, తదితరులు పాల్గొన్నారు.