సూర్యాపేట జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి మహిళల నుండి నిరసన సెగ తగిలింది.మంగళవారం రాత్రి చివ్వెంల మండలం పాచ్యా నాయక్ తండాలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళిన మంత్రికి గిరిజన మహిళలు ఎదురు తిరిగారు.
మంత్రికి కనీసం మాట్లాడానికి కూడా అవకాశం ఇవ్వకుండా గ్రామం మొత్తం ఎదురు తిరగడంతో చేసేదేమీలేక ఆ ఊరి నుండి వెనుదిరిగారు.పాచ్యా నాయక్ తండా మహిళలు మంత్రిని ఎదిరించిన విషయం తెలుసుకున్న సూర్యాపేట బీఎస్పీ అభ్యర్ధి వట్టే జానయ్య యాదవ్ హుటాహుటిన గ్రామానికి చేరుకొని గిరిజన మహిళల కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుని గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే నిరంతర అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలలో ఉండి ప్రజల కోసమే పని చేస్తానని, పాచ్య నాయక్ తండాలో అభివృద్ధిపై మంత్రిని నిలదీసి ఊరు నుంచి తరిమికొట్టిన ప్రతి ఒక్కరికి కాళ్లు కడిగి మీ రుణం తీర్చుకుంటానని తెలిపారు.మీ గ్రామ ప్రజలు ఏ విధంగానైతే మంత్రి జగదీష్ రెడ్డిని అభివృద్ధిపై నిలదీశారో,నేను కూడా ఆ విధంగానే పోరాటం చేశానని అన్నారు.
అభివృద్ధిపై పోరాటం చేస్తే ఒక్కరోజులోనే 75 అక్రమ కేసులు నమోదు చేయించి ఇబ్బందులకు గురి చేశాడన్నారు.ఈరోజు గ్రామాలలో కూడా జగదీష్ రెడ్డిని అభివృద్ధిపై నిలదీస్తూ మొఖం మీదనే ఓట్లు వేయమని చెబుతున్నా సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోనీ గ్రామాలతో పాటు పట్టణంలో కూడా బీఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీ పార్టీలను ప్రజలు,ఓటర్లు అసహ్యించుకుంటున్నారని,జానన్న రావాలి,దొరల పెత్తనం పోవాలనే నినాదం నియోజకవర్గ వ్యాప్తంగా మారు మోగిపోతుందని పేర్కొన్నారు.సద్దల చెరువు కట్టమీద ఐదు కోట్లు ఖర్చుపెట్టి 95 కోట్లు మంత్రి వెనకేసుకున్నాడని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ఐలాపురం సర్పంచ్ బోడబట్ల సునీత, శ్రీను, కౌన్సిలర్లు దిరావత్ నీలాబాయి,లింగ నాయక్, గండూరి రాధిక,రమేష్, మాజీ ఎంపీటీసీ గడ్డం సైదులు,కుంభం నాగరాజు, మీర్ అక్బర్,దేశబోయిన సురేష్ యాదవ్,శ్రావణపల్లి లలిత,పెరుమాళ్ళ కవిత ధరావత్ సుధాకర్,కిరణ్, సురేష్,అనిల్,వీరన్న, రవి,బాల తదితరులు పాల్గొన్నారు.