సూర్యాపేట జిల్లా:పరిసరాల పరిశుభ్రత,ప్రజలందరి భాగస్వామ్యం,స్థానిక నాయకుల సహకారంతో పనిచేసి డెంగ్యూ వ్యాధిని నివారిద్దామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు.జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏఎన్ఎం ఆశలకు అవగాహన కల్పించి మాట్లాడారు.
డెంగ్యూ వ్యాధి వ్యాప్తికి కారణమైన ఏడిస్ ఈజిప్టీ దోమ పెరిగే నీరు నిలువ ఉన్న ప్రదేశాలను గుర్తించి ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించి నిలవ నీటిని తొలగించుకోవాలన్నారు.డెంగ్యూ వ్యాధితో తీవ్రమైన జ్వరం కీళ్లనొప్పులు తలనొప్పి తదితర లక్షణాలు ఉంటాయని వారు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించి ఉచితంగా పరీక్షలు నిర్వహించుకుని డెంగీ వ్యాధిని నిర్ధారించుకోవాలన్నారు.
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు.ప్రారంభంలోనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే డెంగ్యూ వ్యాధిని సులభంగా తగ్గించుకోవచ్చన్నారు.
జిల్లా మలేరియా అధికారి డాక్టర్ సాహితీ మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగీ వ్యాధి ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను మురికినీటి గుంటలను ముందుగా గుర్తించి గ్రామ పంచాయతీ అధికారులకు,మున్సిపల్ అధికారులకు తెలియజేయాలన్నారు.డెంగ్యూ వ్యాధితో బాలింతలు,గర్భిణీ స్త్రీలు,వృద్ధులు,చిన్నపిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని అన్నారు.
డెంగ్యూ వ్యాధిని గుర్తించిన ప్రాంతాల్లో పైరేత్రం సర్వే చేయిస్తున్నట్లు తెలిపారు.అనంతరం డెంగ్యూ వ్యాధి నివారణలో బాగా పనిచేసిన హెల్త్ అసిస్టెంట్ కడారి రమేష్,అనిత,డాక్టర్ ప్రమోద్,శ్రీనివాస్,సరితలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ,జయ శ్యాంసుందర్,చంద్రశేఖర్,శ్రీనివాసరాజు,నాజియా, మాస్ మీడియా అధికారి అంజయ్య,జిల్లా సహాయ మలేరియా అధికారి జి.యాదవరెడ్డి,జిల్లా గణాంకాధికారి వీరయ్య,మత్స్యగిరి,సబ్యూనిట్ అధికారి నర్సయ్య,శ్రీనివాసరాజు,కృష్ణమూర్తి, కె.రమేష్,ఏఎన్ఎం,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.