సూర్యాపేట జిల్లా:జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను అక్రమంగా అరెస్టు చేయడం సరైంది కాదని,ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం స్థానిక మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమను విధుల్లోకి తీసుకోవాలని శాంతియుతంగా ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టిన ఫీల్డ్ అసిస్టెంట్ లను అక్రమంగా అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
గత 14 సంవత్సరాలుగా ఉపాధి హామీలో పనిచేస్తూ లక్షలాది కూలీలకు పనులు కల్పించి,ఎండనక వాననక పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.రాష్ట్ర వ్యాప్తంగా 7650 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీలో పనిచేశారని, ఉద్యోగం నుండి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం మూలంగా వారి మీద ఆధారపడ్డ 35000 కుటుంబాలు వీధిలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ఇప్పటికైనా ఫీల్డ్ అసిస్టెంట్ విధుల్లోకి తీసుకోవాలని కోరారు.లేనియెడల టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమని ఆరోపించారు.
ఈ సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సంఘం రాష్ట్ర నాయకులు వాంకుడోత్ లింగా నాయక్,జిల్లా అధ్యక్షులు యాదయ్య,రాము,లింగయ్య,గోగుల బాబు తదితరులు పాల్గొన్నారు.