సూర్యాపేట జిల్లా:తెలంగాణలో స్థానిక సమరం దిశగా సర్కారు అడుగులు వేస్తున్న క్రమంలో పల్లెల్లో కొత్తల సందడి నెలకొన్నది.దాదాపుగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో ప్రలోభాల పర్వం మొదలైంది.
ఇటీవల స్థానిక సమరం వైపు అడుగులు పడుతుండడంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశవాహుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది.గ్రామాలన్ని ఐక్యంగా పనిచేయాలని సంకల్పంతో ఏకగ్రీవాల కోసం ప్రయత్నించాలని సూచిస్తే ఆశవాహులు మాత్రం ప్రలోభాలకు దిగడం చర్చనీయంగా మారింది.
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికలపై నాయకులు,పెద్ద లీడర్లు ఫోకస్ పెట్టారు.కోదాడ నియోజవర్గంలో కోదాడ మండల పరిధిలో 16 గ్రామపంచాయతీలు,చిలుకూరు మండల పరిధిలో 17 గ్రామ పంచాయతీలు,మునగాల మండల పరిధిలో 22 గ్రామపంచాయతీలు,నడిగూడెం మండల పరిధిలో 16 గ్రామపంచాయతీలు,మోతె మండల పరిధిలో 29 గ్రామపంచాయతీలు,అనంతగిరి మండల పరిధిలో 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
ఈ మొత్తం 119 గ్రామపంచాయతీల్లో సగానికి పైగా ఏకగ్రీవాలు చేయాలనే యోచనతో పెద్ద లీడర్లు కార్యకర్తలను సంజాయిస్తున్నట్లు సమాచారం.దాంతో గతంలో పోటీ చేసి ఓడిపోయిన కార్యకర్తలు,పోటీ చేసే ఆశవాహులు పట్టణాల బాట పట్టి పెద్ద లీడర్లకు తమ సమస్యలను వెల్లబుచ్చుకుంటున్నారని తెలుస్తోంది.
కోదాడ పెద్ద లీడర్లు కూడా ఏకగ్రీవల పైనే మొగ్గు చూపిస్తున్నారని సమాచారం.ఇదిలా ఉంటే గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
రాబోయే పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల సంఖ్య భారీగానే ఉన్నది.కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం కోసం వేలంపాట పెట్టే ప్రయత్నాలు జరుగుతుండడం కోసమెరుపు.
కొన్నిచోట్ల కుల సంఘాలతో మీటింగ్ కు కూడా ఏర్పాటు చేస్తున్నారని వినికిడి.నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో గ్రామాల్లో రోజుకో కొత్త అభ్యర్థి ముందుకు వచ్చి ప్రజల్లో తిరుగుతున్నారు.
పల్లెల్లో ఎక్కడ చూసినా ఫలానా పార్టీ నుండి ఫలానా అభ్యర్థి పోటీకి దిగుతున్నారంటూ ఊహగానాలు మొదలయ్యాయి.ఇక అనంతగిరి మండలంలో అయితే ఏకంగా ఎకరం పొలం ఆఫర్ పెట్టినట్లు తెలుస్తోంది.
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయిల సింగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఏకగ్రీవంగా సర్పంచ్ గా అవకాశమిస్తే గ్రామాభివృద్ధి కోసం 30 లక్షల విలువగల ఎకరం పొలం రాసి ఇస్తానని గతంలోని ప్రకటించారు.ఇలా నియోజవర్గ వ్యాప్తంగా అన్నిచోట్ల హామీలు, సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి.