సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నాపై దాడికి సన్నాహాలు చేస్తున్నారని వైఎస్సార్ టిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న సంచలన ఆరోపణలు చేశారు.మంగళవారం మహాప్రస్థాన పాదయాత్ర లక్కవరం నుండి ఆయన మాట్లాడుతూ సోమవారం వైఎస్ షర్మిల మహాప్రస్థాన పాదయాత్రలో భాగంగా హుజూర్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో తాను స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి గురించి మాట్లాడి అంశాలను దృష్టిలో ఉంచుకొని నాపై దాడి చేయించడానికి ఎమ్మెల్యే సైదిరెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
నేను మాట్లాడింది రాజకీయ ఫాలసి అంశమని,నాకు సైదిరెడ్డికి గెట్టు పంచాయితీ లేదన్నారు.కళాకారుడిగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరి గురించైనా మాట్లాడే,పాట పాడే హక్కు నాకుందని,20 ఏళ్ల నుండి ప్రజా ఉద్యమాలలో ఉన్నానని తెలిపారు.
ఇలాంటి వాటికి భయపడే వాడిని కాదని,సైదిరెడ్డి ఖబడ్దార్ నయీం లాంటి గూండాలు చంపుతమని బెదిరించినా నా పాటను ఆపలేదని,ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ అని గొంతెత్తి ప్రశించానని గుర్తు చేశారు.నాపై సైదిరెడ్డి అనుచరులు దాడికి యత్నిస్తున్నారని,దీనికి సంబంధించి స్థానిక పోలీసులకు సైతం సమాచారం ఉందని,నాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీస్ శాఖపై ఉందన్నారు.
నా మీద ఈగ వాలినా హుజూర్ నగర్ పోలీసులు పూర్తి భాధ్యత వహించాలన్నారు.నాకు సైదిరెడ్డి శత్రువు కాదని,గెట్ల పంచాయతీ లేదని,సైదిరెడ్డి కొసమో లేక ఇంకొకరి కోసమో తాను రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు.
నేను సైదిరెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదని, సైదిరెడ్డే కాదు నేను 119 నియోజకవర్గాలను తిరుగుతానని,స్థానిక ఎమ్మెల్యేలు,మంత్రుల అవినీతిపై ప్రశ్నిస్తానని అన్నారు.సైదిరెడ్డి కబ్జాలు,భూబాగోతాలు, సెటిల్ మెంట్ల లోతుల్లోకి పోతే ఇంకా చాలా ఉందని, ఆయన అవినీతి గురించి హుజూర్ నగర్ ప్రజలే చూసుకుంటారని అన్నారు.