సూర్యాపేట జిల్లా: కోతుల, వీధి కుక్కల బెడద నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.బుధవారం ఆయన పాలకవీడు మండల సిపిఐ కార్యదర్శి ముళ్ళ జానయ్య తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రావుల సత్యంతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో హైదరాబాదులో వీధి కుక్కలు దాడి చేసి నాలుగు సంవత్సరాల చిన్నారిని బలిగొన్న సంఘటన అందరి హృదయాలను కలసివేసిందన్నారు.
హైదరాబాదు మేయర్ తో సహా పలువురు మొసలి కన్నీరు కార్చి సానుభూతి తెలియజేసి చేతులు దులుపుకున్నారని,ఆ తల్లిదండ్రుల కడుపుకోతకు రాష్ట్ర ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.
నేరేడుచర్ల, పాలకవీడు ప్రధాన రహదారిలో,పాలకవీడు మండల చివరి గ్రామాలైన గుండెబోయినగూడెం మహంకాళిగూడెం వెళుతుంటే వందలాది వేలాది వీధి కుక్కలు, కోతులు వాహనదారులపై దాడి చేస్తుండడం పరిపాటిగా మారిందని అవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కోతుల, వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలనిడిమాండ్ చేశారు.కోతులు కరచినా వీధి కుక్కలు కరచినా రేబీస్ సంక్రమించే ప్రమాదం ఉన్నదని ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా రెభీస్ వ్యాధికి వ్యాక్సిన్ కనుక్కోలేకపోయారని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో కోతులను నివారించేందుకు ప్రత్యేక ప్రతిపాదనతో పాటు, కోతుల కోసం ప్రత్యేక వనాలను ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించారని,అన్ని హామీల మాదిరిగానే అది కూడా గాలిలో కలిసిపోయిందని విమర్శించారు.
ఇంకెంతమంది ప్రాణాలు తెలంగాణ ప్రభుత్వం పొట్టన పెట్టుకోబోతుందని ప్రశ్నించారు.
తక్షణమే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై కోతుల,వీధి కుక్కల బెడదల పట్ల ఎమర్జెన్సీని ప్రకటించి ప్రజలను కాపాడాలని కోరారు.అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈ సమస్య పట్ల ఉన్న విధానం ఏమిటని,అట్టి విషయాన్ని ప్రజలకు బహిర్గతం చేయాలని,వీధి కుక్కల నుంచి కాపాడలేని ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత ఉన్నదా అని ప్రశ్నించారు.
పనికిమాలిన పాదయాత్రలు చేస్తున్న వివిధ పార్టీల నాయకులు మూకుమ్మడిగా ప్రగతి భవన్ ముందు నిరాహార దీక్ష చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.