సూర్యాపేట జిల్లా:గత రెండు సంవత్సరాలుగా తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీరోచితమైన పోరాటం చేసి విజయం సాధించిన గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఐటీయూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల పక్షాన జేజేలు పలుకుతున్నామని సిఐటియు జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు ఫిల్డ్ అసిస్టెంట్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు.మంగళవారం స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రమాదకరంగా ఉన్న 43 71 జీవోను రద్దు చేయాలని ఆందోళన చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలగించిందని,తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గత రెండు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు పోరాటాలు సిఐటియు,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలితంగా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి దిగివచ్చి అసెంబ్లీ సాక్షిగా ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహించిన పోరాటం మరువలేనిదన్నారు.ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్ లకు అనేక సమస్యలు ఉన్నాయని,వాటి పరిష్కారం కోసం కూడా బలమైన ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని అన్నారు.
చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబంలో ఒకరికి తిరిగి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వాలని కోరారు.ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి అర్హత లేని వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ విలేఖర్ల సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షులు మేడి యాదయ్య,జిల్లా నాయకులు తుమ్మల రాము,భూడిగె లింగయ్య, పారెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.