సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్( Gadari Kishore Kumar ) దళితులపై చేసిన వ్యాఖ్యలు,దళిత అడ్వకేట్ యుగంధర్ పై జరిగిన దాడి రాజేసిన రాజకీయ దుమారం ఇప్పట్లో ఆగేలా లేదు.ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.
బుధవారం చేపట్టిన తిరుమలగిరి మహాధర్నా పోలీసులతో అడ్డుకున్న విషయం తెలిసిందే.అయినా నిరసనల పరంపర కొనసాగుతోంది.
గురువారం తిరుమలగిరి పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి,శుక్రవారం తిరుమలగిరి పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి కందుకూరి సోమన్న మాదిగ మాట్లాడుతూ ప్రజలారా,ప్రజాస్వామిక వాదులారా తిరుమలగిరి మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించిన తర్వాత పథకం అమలు చేస్తున్న సందర్భంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు బీజేపీ, కాంగ్రెస్,అఖిలపక్షం, ఎమ్మార్పీఎస్ నా కొడుకులకు కూడా దళిత బంధు వచ్చిందని పరుష పదజాలాన్ని ఉపయోగించి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ చేసిన వాక్యాలకు నిరసనగా తిరుమలగిరి మండల అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిన్న తిరుమలగిరి మండల కేంద్రంలో ఎక్స్ రోడ్ లో నిరసన తెలియజేస్తున్న అఖిలపక్ష నాయకులను ప్రభుత్వం వందలాది మంది పోలీసులను దించి చేసిన అక్రమ అరెస్టులను ఖండిస్తూ శుక్రవారం జరిగే తిరుమలగిరి పట్టణ స్వచ్ఛంద బంద్ కు ప్రజాస్వామికవాదులు, వ్యాపార,వాణిజ్య వర్గాలు, వివిధ దుకాణదారులు, హోటల్స్ అన్ని రకాల దుకాణదారులు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సహకరించాలని కోరారు.
ప్రజల గొంతుకగా రాజ్యంగ బద్దంగా నిరసన తెలియజేసే హక్కుకు, మాట్లాడే స్వేచ్ఛకు, పౌరహక్కులకు భంగం కలుగుతున్నప్పుడు పోరాడే శక్తులకు అండగా ఉండాల్సిన బాధ్యత,పౌర సమాజానికి ఉన్నదన్నారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలుసోజు నరేష్,బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు దీన్దయాల్,సిపిఎం మండల కార్యదర్శి కడెం లింగయ్య వివిధ సంఘాల,పార్టీల నేతలు పాల్గొన్నారు.