సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామ ఊర చెరువును కొందరు మట్టితో పూడుస్తూ గత కొన్ని రోజులుగా కబ్జాకు పాల్పడుతున్నారని మత్స్య సహకార సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు.కల్మలచెరువు మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు సైదులు,బిట్టు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన రాకపోవటంతో కబ్జాదారులు మరింత రెచ్చిపోయి చెరువు శిఖం మట్టితో పూడ్చి వేస్తున్నారని,
దీనివల్ల మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారని వాపోయారు.
రాత్రి వేళల్లో అక్రమంగా మట్టిని జేసీబీ, ట్రాక్టర్లతో తోడేస్తూ, చెరువును కుంటగా మారుస్తున్నారని,దీని వల్ల భావితరాలకు భూగర్భ జలాలు అడుగంటి బావుల్లో,బోర్లల్లో నీరు దొరకని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి ఊర చెరువు సర్వే చేయించి, చుట్టు పక్కల హద్దు రాళ్ళను నిర్ణయించి ఊర చెరువును కాపాడాలని, ఊర చెరువును అక్రమించిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.