సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో రెండో యాదగిరిగుట్టగా పేరుగాంచిన రేపాల శ్రీలక్ష్మీనర్సింహాస్వామి దేవాలయం సూర్యాపేట జిల్లా,మునగాల మండలం రేపాల గ్రామంలో స్వయంభూగా గుట్టపై కొలువై ఉన్నాడు.దాదాపు 400 ఏళ్ల నుండి ఇక్కడ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతియేటా అంగరంగ వైభవంగా 10 రోజుల పాటు కన్నులపండువగా జరుగుతాయి.
ఈ ఏడాది మార్చి 13 నుండి జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయ పరిసరాలు సర్వంగ సుందరంగా ముస్తాబయ్యాయి.స్వామి వారి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత నెల రోజుల నుండి ముమ్మర ఏర్పాట్లు చేశారు.
నేటి నుండి జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ పోనుగోటి రంగా తెలిపారు.ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుంచి 22 వ తేదీ వరకు పది రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు 13 న స్వామివారిని సిరిపురం నుంచి రేపాల గుట్టపైకి తీసుకురావడంతో బ్రహ్మోత్సవాల జాతర ప్రారంభమవుతుంది.14 న అధ్యయనోత్సవం, 15 పరమపదోత్సవం,16 న రాత్రి 8 గంటలకు ధ్వజారోహణం(గరుడముద్ద),17 న సాయంత్రం 5 గంటలకు డోలోత్సవం,అదే రోజు రాత్రి 10 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.18 న ఉదయం 10 గంటలకు లక్ష్మీతులసి పూజ,రాత్రి 7 గంటలకు గరుడోత్సవం, 19 రాత్రి 7 గంటలకు రథోత్సవం,20 న చక్రతీర్ధం,రాత్రికి పూర్ణాహుతి,ధ్వజారోహణం,దోపు ,21 న మధ్యాహ్నం 12 గంటలకు గాంధోళి (వసంతోత్సవం)లో వేలాదిగా భక్తులు పోటెత్తుతారు.22 న ఉదయం పది గంటలకు శ్రీ పుష్పయాగం, రాత్రి 9 గంటలకు పవళింపు సేవ,రాత్రి 12 గంటలకు 12 సేవల అనంతరం స్వామి వారు తిరిగి సిరిపురం గ్రామానికి వేంచేయుట జరుగుతుంది.ఈ బ్రహ్మోత్సవాల్లో ఆలయ ప్రధాన అర్చకులు చివలూరి రామకృష్ణాచార్యులు,యాజ్జీక స్వామి నారాయణ,హరికిరణాచార్యులు పాల్గొంటారు.
కళ్యాణోత్సవ వ్యాఖ్యాతగా శ్రీమాన్ స్వామి,వేదాంతం రామాచార్యులు వ్యవహరిస్తారు.
*అభివృద్ధికి నోచుకోని ఆలయం*
సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన రేపాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నేటికి అభివృద్ధికి నోచుకోవడం లేదు.
ప్రభుత్వాలు,పాలకులు మారినా ఆలయాభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడంతో ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆలయం నానాటికి మసకబారి పోతుంది.ఆలయ దూప దీప నైవేద్యాల కోసం ఆనాటి నడిగూడెం సంస్థానాధీశులు కీసర రాజా వారు కేటాయించిన సుమారు 70 ఎకరాల భూమి ఉన్నది.ఆ భూమి గత 30 ఏళ్ల వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నది.30 ఏళ్ల క్రితం గ్రామంలోని భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఆనాటి నుండి గ్రామ దళితులు కౌలు చెల్లిస్తూ సాగు చేసుకుంటున్నారు.ఆలయానికి చైర్మన్లు మారిన ప్రతిసారీ కొద్దో గొప్పో కౌలు పెంచుకుంటూ గతేడాది ఎకరానికి 3 వేల రూపాయల కౌలు పెంచారు.
పెంచిన కౌలు ప్రకారం ఇప్పటికే కొంతమంది కౌలు చెల్లించగా మిగతా వారు ఎకరానికి 3 వేల రూపాయల కౌలు చెల్లిస్తామని చెబుతున్నారు.అందరూ సక్రమంగా కౌలు చెల్లిస్తే 2 లక్షల 10 వేల రూపాయల సమకూరే అవకాశం ఉంటుంది.
గతంలో దాతలు ముందుకొచ్చి విరాళాలు అందివ్వడంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగేవని, ప్రస్తుతం దాతలు విరాళాలు పెద్దగా ఇవ్వకపోవడంతో కౌలు డబ్బులతోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆలయ కమిటీ నిర్వాకులు వాపోతున్నారు.ఈసారి కౌలు రైతుల నుండి అనుకున్న స్థాయిలో కౌలు రాకపోవడంతో బ్రహ్మోత్సవాల నిర్వహణ కష్టంగా మారిందని ఆలయ కమిటీ చైర్మన్ పోనుగోటి రంగా తెలిపారు.
అయితే ఆలయ భూములన్నీ వర్షాధార మెరక భూములు కావడంతో ఒక్కో యేడు కాలం కలిసిరాక,పంటలు పండక నష్టాలు రావడంతో కౌలుదారుల్లో కొంతమంది కౌలు చెల్లించకపోవడంతో ఆలయ ఆదాయానికి గండిపడే పరిస్థితి ఏర్పడి,బ్రహ్మోత్సవాల నిర్వహణలో సమస్యలు తలెత్తుతున్నాయి.తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న నేపథ్యంలో రేపాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాభివృద్ధిపై కూడా నజర్ పెట్టాలని గ్రామస్తులు,భక్తులు కోరుతున్నారు.
ప్రభుత్వం ఇలాంటి చారిత్రక నేపథ్యం కలిగిన దేవాలయాలపై సవతి తల్లి ప్రేమను చూపడం ద్వారా అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారి,కొన్ని ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.ఈ ఆలయ నిర్వహణకు సరిపడా నిధులు లేకపోవడంతో ప్రతిఏటా దేవస్థాన కమిటీ వారు దాతల నుండి విరాళాలు సేకరించి స్వామివారి కళ్యాణంతో పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించాల్సి వస్తుంది.
ఆధ్యాత్మిక చింతనతో అలరారే ఆలయాల్లోకి రాజకీయ పార్టీల జోక్యం పెరగడంతో దేవాలయాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ నేతలకు ఆలయ చైర్మన్ గిరి కట్టబెట్టడంతో వారు ఆలయ నిర్వహణను వ్యాపారంగా మార్చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆలయం కమిటీలు నామినేటెడ్ పోస్టుల్లా మారిపోవడం చేత,ఉన్నన్ని రోజులు దేవునికి సేవ చేయాలనే తపన కొందరికి ఉంటే,దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే దృక్పథంతో ఎక్కువమంది ఉండటంతో ఆలయాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనేది బహిరంగ రహస్యమే.దీనికి తోడు దేవాదాయ,ధర్మాదాయ శాఖా అధికారుల పని తీరు కూడా కొంత శాపంలా మారిందని చెప్పవచ్చు.
ఆలయ కమిటీలపై సరైన పర్యవేక్షణ లేకుండా,ఆలయ ఆస్తులు కబ్జాలకు గురైనా,ఆలయ ఆదాయ వ్యయాలపై దృష్టి పెట్టకుండా,చర్యలు తీసుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం మూలంగా అనేక ప్రాంతల్లో ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి.ఆయాలంలో భక్తులు సమర్పించే కానుకల కోసం హుండీ నిర్వహణ లేకపోవడంతో ఆలయ అర్చకుల పరిస్థితి కూడా మరింత దయనీయంగా మారింది.
ప్రతి ఏటా స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలో కొంత హడావుడి చేయడం,తర్వాత ఆలయ అభివృద్ధి గురించి పట్టించుకోకపోకడం వలన గత కొన్నాళ్లుగా ఇక్కడ జరిగే 10 రోజుల బ్రహ్మోత్సవాల జాతర యొక్క ప్రశస్తం నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, దేవాదాయ,ధర్మాదాయ శాఖా అధికారులు చొరవ తీసుకొని రేపాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఎండోమెంట్ కింద తీసుకుని,ఆలయ అర్చకులకు అందరిలా నెల నెలా శాలరీ ఇస్తూ,భక్తులు ద్వారా,ఆలయ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తూ,ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు కేటాయించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తే ఈ ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారి,మంచి పర్యాటక స్థలంగా మారుతుందని స్థానికులు కోరుతున్నారు.