శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు.ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆగస్టు 20న (నేడు) మహిళలు పెద్ద ఎత్తున ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం తమపై కలిగి ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా తమ కుటుంబాన్ని అభివృద్ధిలో నడిపిస్తూ, తన మాంగల్యాని పదికాలాలపాటు చల్లగా కాపాడుతుందని మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారు.
ఈ విధంగా అమ్మవారికి వ్రతం ఆచరించే సమయంలో అమ్మవారికి ఏ విధమైనటువంటి పుష్పాలతో అలంకరిస్తే ప్రీతి చెందుతారు అనే విషయానికి వస్తే అమ్మవారి అలంకరణలో భాగంగా కలువ పువ్వులు, మొగలి పువ్వులు, సంపెంగ పూలు, మల్లెపువ్వులతో పూజ చేయటం వల్ల అమ్మవారికి ఎంతో ప్రీతి చెంది ఆమె అనుగ్రహం ఎల్లవేళలా భక్తులపై చూపుతారు.
అదేవిధంగా వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి పెద్దఎత్తున నైవేద్యాలు తయారు చేసి సమర్పిస్తారు.

ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతంలో మహిళలు అమ్మవారికి తొమ్మిది రకాల పిండివంటలు తయారు చేసి సమర్పించడంవల్ల అమ్మవారి కరుణాకటాక్షాలు మనపై ఉంటాయని భావిస్తారు.ఈ క్రమంలోనే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం కోసం ఎక్కువ శాతం మంది పూర్ణం బూరెలు, బొబ్బట్లు, పులగం, చలిమిడి, సెనగలు, వడపప్పు, పులిహోర, కేసరి, పంచామృతాలను నైవేద్యంగా సమర్పించి పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.ఈ విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన తర్వాత అమ్మవారి కథ చదివి సాయంత్రం ఐదుగురు లేదా తొమ్మిది మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమలతో పాటు పండ్లు వాయనంగా ఇవ్వడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.
అయితే వరలక్ష్మీ వ్రతం చేసే వారు తప్పనిసరిగా ఉపవాసంతో వరలక్ష్మీ వ్రతం చేయటం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.