సూర్యాపేట జిల్లా: జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోని ఆత్మకూర్(ఎస్) మండలంలో కరపత్రాలు వైరల్ గా మండల వ్యాప్తంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.మండలంలో సహజ వనరులను కొల్లగొడతూ ఆత్మకూర్ (ఎస్) గ్రామాన్ని నాశనం చేస్తున్న దొంగలకు సద్దుల మోసేవారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుదాం అంటూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలో కరపత్రాలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా పలువురు కమిటీ సభ్యులు మాట్లడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి,సహజ వనరులైన కొండలు, గుట్టలను ధ్వంసం చేస్తూ క్రషర్ మిల్లులను నడుపుతూ గ్రామాభివృద్ధికి ఆటంకంగా మారిన వ్యక్తులకు గ్రామంలోని కొందరు సపోర్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాంటి వారికే ఈ ప్రభుత్వం రైతుబంధు ఇస్తుందంటూ ఆరోపించారు.
అభివృద్ధి పేరుతో ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు వెడల్పులో భాగంగా ఇండ్లు కోల్పోయిన బాధితులకు నేటి వరకు నష్టపరిహారం చెల్లించలేదని,వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదన్నారు.పిఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో భారీగా అవకతవకలు జరిగినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.
పలు ప్రజా వ్యతిరేక విధానాలను పొందుపర్చిన కరపత్రాలను మండల కేంద్రంలో పాటు అన్ని గ్రామాల్లో విస్తృతంగా పంపిణీ చేశామని తెలిపారు.
ప్రస్తుతం మండలంలో ఈ కరపత్రాలపై సర్వత్రా చర్చ జరుగుతుంది.
మండల అభివృద్ధికి నిరోధకలుగా మారిన వారికి ఎన్నికలలో బుద్ధి చెప్పాలనే వాదన ప్రజల నుండి బలంగా వినిపిస్తోంది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాకి కృపాకర్ రెడ్డి,కాకి జార్జిరెడ్డి,తంగెళ్ల పెద్ద వీరారెడ్డి,కాకి రంగారెడ్డి,ములకలపల్లి లక్ష్మయ్య,కొప్పుల శేఖర్ రెడ్డి,కాసగాని మల్సూరు, గొట్టుముక్కల కృష్ణారెడ్డి సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు గుణగంటి శ్రీను,బీజేపీ నాయకులు చందా కృష్ణమూర్తి,బైరెడ్డి వెంకటరెడ్డి,పందిరి మాధవరెడ్డి,రాచమల్ల సంతోష్,మేకల పుల్లయ్య గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడు ఉప్పల శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అయితే ఈ కరపత్రాలు ఇప్పుడు మండలంలో అందరినీ ఆలోచింపచేస్తున్నయని అంటున్నారు.