సూర్యాపేట జిల్లా:గత పల్లె ప్రగతి బిల్లులు చెల్లించుటకు పరిశీలించాలని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు మాజీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బహిరంగ లేఖ రాశారు.సూర్యాపేట జిల్లా,హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాల పరిధిలోని గ్రామ పంచాయితీలలో ఐదవ విడత పల్లె ప్రగతి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది.దీనికి ముందు గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి పనులకు సంబంధించి రూ.2 లక్షల నుండి 10 లక్షల వరకు బిల్లులు సంవత్సరాలు గడుస్తున్నా చెల్లించడం లేదని పేర్కొన్నారు.చిన్న గ్రామ పంచాయితీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని సిబ్బంది జీతాలు,డీజిల్ బిల్లులు,కరెంట్ బిల్లులు,ట్రాక్టర్ ఈఎంఐలు చెల్లించే పరిస్థితి లేదు.పల్లె ప్రగతి పనుల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు.
మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే బోర్ మెకానిక్లు,కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాల భారం గ్రామ పంచాయితీల మీద లేకుండా చూడాలి.ప్రభుత్వం తలపెట్టిన పనుల బిల్లులు చెల్లించడంలో కాలయాపన చేయడం వలన గ్రామ సర్పంచులు ఆర్ధికంగా,మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇవే కాకుండా ఇతర పనులకు సంబంధించిన బిల్లులు 3 నుండి 6 నెలల వరకు పెండింగ్లో ఉంటున్నాయి.కావున ఐదవ విడత పల్లె ప్రగతికి ముందే గ్రామాలకు రావాల్సిన గత పల్లె ప్రగతి బిల్లులను చెల్లించి వారిని ఆదుకోనుటకు పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు.
అలాగే ఈ లేఖను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు,సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి పంపించినట్లు తెలిపారు.