సూర్యాపేట జిల్లా:జూలై నెలలో 8వ విడత ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంపై బాలల రక్షణ,బాలకార్మిక వ్యవస్థ,మానవ అక్రమ రవాణా నిర్మూల అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కేంద్రం నుండి ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
బాలల రక్షణ,మానవ అక్రమరవాణా, బాలల రక్షణ కోసం మానవతా ధర్మంతో సిబ్బంది పని చేయాలని సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పిపోయిన,వెట్టి చాకిరికి, వేధింపులకు,ఆక్రమణకు గురవుతున్న బాలలను రక్షించి,సంరక్షించే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్,జూలై నెలలో ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని తెలిపారు.
జూలై నెలలో 8 వ విడత ఆపరేషన్ మస్కాన్ ను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని అన్నారు.నిరాదరణకు,వేధింపులకు,అభద్రతకు గురతున్న బాలల రక్షణ కోసం తీసుకోవలసిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మానవ అక్రమ రవాణా అనేది ప్రస్తుత సమాజంలో చాలా ప్రమాదకరంగా మారినదని,అక్రమరవాణా నిరోధానికి రాష్ట్ర మహిళా శిశు భద్రత పోలీసు విభాగం అధ్వర్యంలో యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ పోలీస్ టీమ్స్ పని చేస్తున్నాయన్నారు.మానవ అక్రమ రవాణా గుర్తించి అలాంటి వారికి న్యాయం చేయాలని అన్నారు.
బాల కార్మికులను లేకుండా చేయాలని,చిన్న చిన్న కర్మాగారాలు, హోటల్స్,లాడ్జ్ లు,ఇటుక బట్టిలల్లో పిల్లలతో పనులు చేయించడం నేరమని అన్నారు.ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలను పనిలో పెట్టుకోవద్దని కోరారు.
బాల్య వివాహాలు నిరోధించాలని,అనధికారికంగా చట్టవిరుద్ధంగా పిల్లలను దత్తత తీసుకోవడంతో నేరమన్నారు.బాలల విషయంలో చట్ట వ్యతిరేకంగా జరిగే అన్ని రకాల కార్యకలాపాలను గుర్తించి బాలలను రక్షించి, సమరక్షించాలని,గుర్తించిన బాలలను తల్లిదండ్రులకు అప్పగించడం,సంరక్షణ కేంద్రాలకు తరలించడం చేయాలన్నారు.
ఎన్జీవోలు,ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు,మానవ అక్రమ రవాణా నిరోధక సిబ్బంది,చైల్డ్ సంక్షేమ సిబ్బంది,ఐసీడీస్ అధికారులు, పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొనగా,ఎస్పీ వెంట ఇన్స్పెక్టర్ నర్సింహ,ఆర్ఐ గోవిందరావు,ఎస్ఐ రవీందర్,ఐటీకోర్ కానిస్టేబుల్ సుమన్,సిబ్బంది పాల్గొన్నారు.