సూర్యాపేట జిల్లా:ఖరీఫ్ సాగు సీజన్ కావడంతో బోరు,బావులను సిద్ధం చేసుకుంటున్న అన్నదాతలకు దొంగల బెడద నిద్రలేకుండా చేస్తుంది.నేరేడుచర్ల మండలం పాత నేరేడుచర్ల వద్ద ఇటుక బట్టీల పరిసర పంటపొలాల్లో బోర్లు,బావులకి అమర్చిన విద్యుత్ మోటార్ల కేబుల్ వైర్లును శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగిలించిన వ్యవహారం ఆదివారం వెలుగుచూసింది.
వర్షాకాలం పంటల సీజన్ మొదలు కావడంతో రైతులు తమ పొలాలలో బోర్లు, బావులకు విద్యుత్ మోటార్లు బిగించి నారుమడ్లకు నీళ్లు పెట్టే క్రమంలో ఉన్నారు.ఇదే అదనుగా భావించిన దొంగలు రాత్రి సమయంలో సుమారుగా 20 మోటార్ల కేబుల్ వైర్లని దొంగిలించారు.
గతంలో కూడా ఇలాంటి దొంగతనాలు జరిగాయని రైతులు వాపోతున్నారు.ఒక్కొక్క రైతుకు సుమారుగా రూ.2000 నష్టం జరుగుతుందని బాధిత రైతులు కె.యల్లయ్య,పోరెడ్డి శ్రీరామ్ రెడ్డి,దొంతిరెడ్డి వెంకటరెడ్డి, మన్నెం సుధాకర్ రెడ్డి,సంకలమద్ది రామిరెడ్డి,కల్లూరి కళమ్మ,కేసగాని సైదులు,తాటికొండ సోమిరెడ్డి,నూకల శశిధర్ రెడ్డి,కేస నర్సిడ్డి తదితర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇది దొంగల ముఠా పనా? లేక తెలిసిన వారు చేస్తున్న అరాచకమా అర్థం కావడం లేదని,దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.