సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు.శనివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయిన పెట్రోలియం ఉత్పత్తుల ధరల వల్ల, ప్రత్యక్షంగా,పరోక్షంగా అన్ని రకాల వస్తువులపై పన్నుల భారం పడి,ప్రజా అవసరమైన వస్తువుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు.
దేశంలోని పేద,మధ్య తరగతి వర్గాల ప్రజలు అధిక ధరలతో అల్లాడుతున్నారని, అందువల్ల పెట్రోలియం ఉత్పత్తుల ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవడం ద్వారా కొంతమేరకు ఉపశమనం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 8 ఏళ్ల కాలంలో ఎందుకు పనికిరాని స్వామీజీల విగ్రహాలు,జాతికి అంకితం చేస్తూ,కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన బ్యాంకులు,రైళ్లు, విమానాలు,బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి వంటి సంస్థలను అంబానీ,ఆధానిలకు అంకితం చేసుకున్నారని,అచ్చే దిన్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని,దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నది మొదలుకొని నేటి దళిత బంధు వరకు అన్ని మోసపూరిత వాగ్దానాలేనని విమర్శించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు కత్తి శ్రీనివాసరెడ్డి,ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అంబటి అంజి పాల్గొన్నారు.