నిత్యం పత్రికలు, టీవీలలో ఎన్ఆర్ఐ అల్లుళ్ల బాగోతాలు బయటికి వస్తున్నా ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులకు ఎన్ఆర్ఐ( NRI ) సంబంధాలపై మోజు తగ్గడం లేదు.గడిచిన ఐదేళ్లలో విదేశాలలో తమ జీవిత భాగస్వాములు( Life Partners ) తమను విడిచిపెట్టారని ఆరోపిస్తూ ఎన్ఆర్ఐ మహిళల నుంచి దాదాపు 1617 ఫిర్యాదులు వచ్చినట్లు గురువారం భారత ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలియజేసింది.
రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్( Union Minister Kirti Vardhan Singh ) లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.విదేశాలలో నివసిస్తున్న వివాహిత ఎన్ఆర్ఐ మహిళలు( Married NRI Women ) ఎదుర్కొంటున్న గృహ హింస, వేధింపులు, ఇతర వైవాహిక వివాదాల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి అన్నారు.

విదేశాల్లోని భారతీయ మిషన్ల నుంచి సేకరించిన డేటా ప్రకారం గడిచిన ఐదేళ్ల కాలంలో 1617 మంది ఎన్ఆర్ఐ మహిళలు తమ జీవిత భాగస్వాములు తమను వదిలివేసినట్లు ఫిర్యాదులు అందాయని కీర్తి వర్ధన్ తెలిపారు.విదేశాలలో భర్తలు విడిచిపెట్టబడిన భారతీయ మహిళల రాష్ట్రాల వారీగా డేటాను విదేశాంగ శాఖ నిర్వహించదని మంత్రి స్పష్టం చేశారు.వివాహం తర్వాత భార్యలను విడిచిపెట్టిన ఈ వ్యక్తులపై ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుందా? అలాంటి భారతీయ మహిళలను దోపిడీ నుంచి రక్షించడానికి ఏవైనా నిర్దిష్ట చట్టాలు లేదా నిబంధనలు అమల్లో ఉన్నాయా అని విదేశాంగ శాఖను సభ్యులు అడిగారు.

ఇలాంటి కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరిష్కరిస్తాయని కీర్తి వర్ధన్ చెప్పారు.విదేశాల్లోని భారతీయ మిషన్ల ద్వారా బాధిత మహిళలకు కౌన్సెలింగ్, సమాచారాన్ని అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.తమ అధికార పరిధిలోని ప్రాంతాలలో భారతీయ సంఘాలు, ఎన్‌జీవో సభ్యులతోనూ క్రమం తప్పకుండా తమ మిషన్లు టచ్‌లో ఉన్నాయని ఓపెన్ హౌస్ సమావేశాల ద్వారా కూడా వారి ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని కీర్తి వర్థన్ తెలిపారు.
బాధిత మహిళలకు MADAD, CPGRAMS, సోషల్ మీడియా ద్వారా ఆన్‌లైన్ కాన్సులర్ సహాయం అందించబడుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.