విదేశాల్లో చదువుకోవాలనే కల చాలా మంది భారతీయ యువతలో ఉంటుంది.డాలర్లు సంపాదించి, లైఫ్‌లో సెటిల్ అవ్వొచ్చనే ఆశ.
కానీ ఆ కల తీరకపోతే? భారీ అప్పులు( Debts ) మెడకు చుట్టుకుంటే? అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు ఓ 27 ఏళ్ల భారతీయ యువకుడు.తన జీవితం ఎలా తలక్రిందులైందో చెబుతూ రెడిట్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.అతని గుండెకోత వింటే కన్నీళ్లు ఆగవు.
2022లో, ఈ యువకుడు ఎన్నో ఆశలతో అమెరికాలో( America ) మాస్టర్స్ డిగ్రీ( Masters Degree ) చేయడానికి బయలుదేరాడు.ఇందుకోసం ఏకంగా రూ.40 లక్షల ఎడ్యుకేషన్ లోన్( Education Loan ) తీసుకున్నాడు.కష్టపడి చదువు పూర్తిచేశాడు.ఇక మంచి ఉద్యోగం సంపాదించి, అప్పు తీర్చేయడమే తరువాయి అనుకున్నాడు.కానీ అమెరికాలో ఆర్థిక మాంద్యం, కఠినమైన వీసా నిబంధనలు అతని ఉద్యోగ ప్రయత్నాలకు అడ్డుపడ్డాయి.ఏడాది పాటు కాళ్లరిగేలా తిరిగినా ఒక్క జాబ్ కూడా దొరకలేదు.
కలలన్నీ కల్లలయ్యాయి.

చేసేది లేక, ఆ రూ.40 లక్షల అప్పుల భారాన్ని నెత్తిన మోస్తూ భారత్‌కు తిరిగి వచ్చేశాడు.ఇక్కడ కష్టపడితే, నెలకు రూ.75,000 జీతంతో ఓ ఉద్యోగం దొరికింది.‘హమ్మయ్య, బతుకు బండి లాగించొచ్చు’ అనుకునేలోపే అసలు కష్టం మొదలైంది.తీసుకున్న లోన్‌కు నెలనెలా కట్టాల్సిన EMI ఏకంగా రూ.66,000.అంటే, జీతంలోంచి EMI పోగా చేతికి మిగిలేది కేవలం రూ.9,000 మాత్రమే.
ఈ రూ.9,000తో అతను నెలంతా బతకాలి, తనతో పాటు ఐదుగురు ఉన్న కుటుంబాన్ని పోషించాలి.ఇది ఎలా సాధ్యం? అతని తండ్రి ఒక చిన్న పరిశ్రమ నడిపేవారు.కొడుకు చదువు కోసం దాచుకున్న డబ్బంతా ఖర్చుపెట్టేశారు.
దీంతో వ్యాపారం దెబ్బతిని మూతపడింది.ఈ ఆర్థిక ఒత్తిడితో ఆయన ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించింది.
ఒకవైపు కొడుకు అప్పుల బాధ, మరోవైపు వ్యాపారం లేకపోవడం, ఇంకోవైపు అనారోగ్యం.ఆ కుటుంబం పడుతున్న వేదన వర్ణనాతీతం.

దిక్కుతోచని స్థితిలో, ఆ యువకుడు సలహా కోసం రెడిట్‌ను ఆశ్రయించాడు.లోన్ భారం తగ్గించుకోవడానికి బ్యాంకులను సంప్రదించానని, వడ్డీ తగ్గించమని, వాయిదా పెంచమని అడిగానని.ఏదీ వర్కవుట్ కాలేదని వాపోయాడు.అదనపు ఆదాయం కోసం చిన్న చిన్న పనులు (సైడ్ గిగ్స్) ట్రై చేశానని, స్వచ్ఛంద సంస్థల (NGO) సహాయం కోరానని, ఏ ప్రయత్నమూ ఫలించలేదని తన ఆవేదనను పంచుకున్నాడు.“నా జీవితం మొత్తం ఈ అప్పు తీర్చడానికే సరిపోతుంది, నేను బతికేది ఎప్పుడు?” అన్న అతని మాటలు గుండెల్ని పిండేస్తున్నాయి.
అతని కథ చదివిన రెడిట్ యూజర్లు చలించిపోయారు.కొందరు ధైర్యం చెప్పారు.“ఇప్పుడే కష్టం, భవిష్యత్తులో నీ జీతం పెరుగుతుంది, అప్పు తగ్గుతుంది, కుదుటపడతావు” అని భరోసా ఇచ్చారు.మరికొందరు ప్రాక్టికల్ సలహాలు ఇచ్చారు.“బ్యాంకుతో మళ్లీ మాట్లాడు, లోన్ కాలపరిమితి పెంచమని గట్టిగా అడుగు”, “వడ్డీ తగ్గించే అవకాశం ఉందేమో చూడు” అని సూచించారు.ఇంకొందరైతే, “ఎట్టి పరిస్థితుల్లోనూ కుటుంబం ఉంటున్న ఇల్లు అమ్మొద్దు, ఆదాయం పెంచుకునే మార్గాలపైనే ఫోకస్ చెయ్” అని హెచ్చరించారు.
ఈ యువకుడి కథ ఒక్కడిది కాదు.
విదేశీ చదువుల మోజులో పడి, ఆర్థిక పరిస్థితులను సరిగ్గా అంచనా వేసుకోకుండా, లక్షల రూపాయల అప్పులు చేసి, చివరికి ఉద్యోగం దొరక్క లేదా అనుకున్నంత సంపాదన లేక.ఇండియాకు తిరిగి వచ్చి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఎందరో భారతీయ విద్యార్థుల వ్యథకు ఇది అద్దం పడుతోంది.