ఈ ఏడాది ఉగాది పండుగ( Ugadi Festival ) మార్చి 30, ఆదివారం నాడు వచ్చింది.ఉగాది ద్వారా విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.
అయితే అసలు ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు.? ఉగాది పచ్చడి( Ugadi Pachadi ) తినడం వల్ల ఎటువంటి లాభాలు పొందొచ్చు.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఉగాది అత్యంత ముఖ్యమైన పండుగ.
తెలుగు మరియు కన్నడ నూతన సంవత్సరంగా ఉగాదిని జరుపుకుంటారు.
హిందూ పంచాంగ ప్రకారం.
చైత్ర మాసం, శుక్ల పక్షం, పాడ్యమి తిథి నాడు ఉగాది వస్తుంది.పురాణ కథల ప్రకారం చూస్తే.
కలియుగం ప్రారంభమైన రోజు ఉగాది అని చెప్తారు.అలాగే చైత్ర శుక్ల పాడ్యమి నాడు బ్రహ్మ దేవుడు ఈ విశాల విశ్వాన్ని సృష్టించాడు కాబట్టి బ్రహ్మ సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాదిని జరుపుకుంటారని అంటారు.
కొన్ని పురాణ కథలు.ఆ రోజున శ్రీరాముని పట్టాభిషేకం జరిగినట్లు చెబుతారు.
ఇక వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఈ ఉగాది పండుగను పకృతి పండుగగా కూడా చెబుతారు.

నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ కొత్త ఆశలతో, కొత్త సంకల్పాలతో, ఆరోగ్యం, ఆనందం, శుభఫలితాలను కోరుకుంటూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగే ఉగాది.ఈ ఉగాది రోజున ఉగాది పచ్చడి తినడం ఆనవాయితీగా వస్తుంది.ఉగాది పచ్చడి ఆరు రుచులను(తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు) కలిగి ఉంటుంది.
దీనిని షడ్రుచుల సమ్మేళనమని కూడా అంటారు.ఉగాది పచ్చడి జీవితంలోని అన్ని అనుభవాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది.
జీవితం యొక్క అనేక భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది.

అలాగే ఆరోగ్యపరంగా కూడా పలు లాభాలను చేకూరుస్తుంది.ఉగాది పచ్చడిలో బెల్లం, లేత మామిడి పిందెలు, చింతపండు, ఉప్పు, లేత వేప పువ్వులు, మిరపకారం ఉపయోగిస్తాయి.బెల్లం రక్తాన్ని శుభ్రపరుస్తుంది.
శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచి రక్తహీనతకు చెక్ పెడుతుంది.చింతపండు జీర్ణాశయ ఆరోగ్యాన్ని, లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.
మిరపకారం రక్త ప్రసరణను పెంచుతుంది.వైరల్ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తుంది.
ఉప్పు శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రిస్తుంది.వేపపువ్వు కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.మలబద్ధకాన్ని( Constipation ) తగ్గించడంలో సహాయపడుతుంది.ఇక లేత మామిడి పిందెలు శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తాయి.
మొత్తంగా సీజనల్ మార్పులకు శరీరాన్ని అలవాటు పడేలా చేయడంతో పాటు, కొత్త సంవత్సరాన్ని ఆరోగ్యంగా ప్రారంభించడానికి ఉగాది పచ్చడి అద్భుతంగా తోడ్పడుతుంది.