సూర్యాపేట జిల్లా:జిల్లాలో జలశక్తి పథకం ద్వారా చేపట్టిన పనులను పరిశీలించేందుకు త్వరలో కేంద్ర బృందం పర్యటిస్తుందని,ఆ దిశగా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కేంద్ర బృందం పర్యటన సందర్బంగా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తో కలసి జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 6 నుండి 10 వరకు జిల్లాలో చేపట్టిన జలశక్తి అభియాన్ పనులను పరిశీలించనున్నారని,శాఖల వారీగా చేపట్టిన పనుల నివేదికలను అందించాలని,అలాగే పర్యటన షెడ్యూల్డ్ ను తయారు చేయాలని ఆదేశించారు.
కేంద్ర బృందం పర్యటనలో భాగంగా పనుల పరిశీలన చోట ఇంచార్జ్ లను నియమించి పూర్తి అవగాహనతో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.కేంద్ర బృందం పర్యటనలో ముందుగా జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అలాగే తదుపరి గడ్డిపల్లి వ్యవసాయ క్షేత్ర సందర్శన అనంతరం పట్టణంలోని మున్సిపల్ పరిధిలో జలయాజమాన్య పనుల పరిశీలన,అలాగే రెండోరోజు చివ్వెంల,మోతె మండలంలో జలవనరుల సంరక్షణ పనుల పరిశీలన, మూడో రోజు మునగాల పర్యటన,అనంతరం జిల్లా కలెక్టరేట్ లో సమావేశం,పనుల నివేదికలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.
కేంద్ర బృందం పర్యటనలో భాగంగా జిల్లాలో చేపట్టిన పనులకు సంబంధించిన అన్ని శాఖల అధికారులు ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేయాలని,మంగళవారం సాయంత్రం 5 గంటలకు జలశక్తి పనులపై సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సి.ఈ.ఓ సురేష్,పి.డి.కిరణ్ కుమార్,డి.పి.ఓ యాదయ్య,డి.ఏ.ఓ రామరావు నాయక్,జిల్లా ఉద్యాన అధికారి శ్రీధర్,పి.ఆర్.ఈ ఈ శ్రీనివాస రెడ్డి,ఆర్&బి ఈఈ యాకుబ్, మున్సిపల్ కమిషనర్ బి.సత్యనారాయణ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.