సూర్యాపేట జిల్లా:ఈనెల 21 నుండి జూన్ 21 వరకు కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న వరంగల్ డిక్లరేషన్ రైతు రచ్చబండ కార్యక్రమం పేట కాంగ్రేస్ పార్టీలో చిచ్చు రేపింది.సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీలో ఇప్పటికే మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి వర్గం,పటేల్ రమేష్ రెడ్డి వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రేస్ పార్టీ తమ అంతర్గత లోపాలను సవరించుకొని రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని జాతీయ స్థాయిలో కసరత్తు చేస్తుంటే అదే స్థాయిలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో కాంగ్రేస్ వర్గపోరు శృతిమించి పాకాన పడిందని శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రేస్ పార్టీ కార్యాలయం రెడ్ హౌస్ లో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ నిర్వహించిన మీడియా సమావేశంలో బహిర్గతమైంది.
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షులు చెవిటి వెంకన్న విలేకరులతో మాట్లాడుతూ డీసీసీ అనుమతి లేకుండా పటేల్ రమేష్ రెడ్డి రైతు రచ్చబండ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో నిర్వహిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని,అతనికి పార్టీకి ఎలాంటి సంభంధం లేదని చెప్పడంతో ఇప్పటి వరకు వర్గాలుగా పని చేస్తున్న దామోదర్ రెడ్డి,రమేష్ రెడ్డి వర్గాల మధ్య ఏర్పడిన రాజకీయ వైరం మరింత ముదిరిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.డీసీసీ అధ్యక్షుడు అంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి పటేల్ రమేష్ రెడ్డిపై రాష్ట్ర నాయకత్వానికి తెలియపరిచామని,అతని పదవులు కూడా రద్దు అయినాయని చెప్పడంతో పేట కాంగ్రేస్ లో ఖాళీ కుర్చీ కోసం జరిగే తన్నులాట పార్టీ శ్రేణులను మరింత వేడిని రాజేసింది.
ఇదే సందర్భంలో డీసీసీ అధ్యక్షుడు పటేల్ రమేష్ రెడ్డిని ఉద్దేశించి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాలపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించడంతో ఇప్పటి వరకు రెండు గ్రూపులుగా ఉన్నా ఎన్నికల నాటికి ఎలాగోలా ఒక్కటిగా ఎన్నికలను ఎదుర్కొంటారని భావించిన పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైంది.ఇప్పటికే రెండు దఫాలుగా అధికారం లేక కార్యకర్తలు అనేక ఇబ్బందులకు గురవుతూ,ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నేపథ్యంలో ఈసారి సూర్యాపేట నియోజకవర్గంలో ఎట్లైనా కాంగ్రేస్ ను గెలిపించుకోవాలని కార్యకర్తలు కంకణం కట్టుకొని అవిశ్రాంతంగా పని చేస్తున్నారు.
ఈ తరుణంలో డీసీసీ అధ్యక్షుడి మాటలు దింపుడుకల్లం ఆశలను కూడా లేకుండా చేసిందని కరుడుగట్టిన కాంగ్రేస్ కార్యకర్తల్లో అలజడి నెలకొని అయోమయానికి గురవుతున్నారు.ఈ దఫా సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రేసు గెలవకపోతే నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు వేరే పార్టీకి వెళ్లి అవకాశం కనిపిస్తుందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
పేట పార్టీలో చిచ్చు రేపుతున్న వర్గపోరు విషయంలో పార్టీ అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించి,కఠిన చర్యలు తీసుకోకపోతే పార్టీ పరిస్థితి మరింత అద్వాన్నంగా మారే ప్రమాదం ఉందని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు.