సూర్యాపేట జిల్లా:జిల్లాలో సంచలనం సృష్టించిన సూర్యాపేట రూరల్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు,మాజీ నక్సలైట్ వడ్డే ఎల్లయ్య( Vadde yellaiah) హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు.ఓ పంచాయితీ సెటిల్మెంట్ వంకతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు పిలిపించి, పక్కా ప్లాన్ ప్రకారం గత నెల 19 న వడ్డే ఎల్లయ్యను హతమార్చినట్లు,అనంతరం మృతదేహాన్ని చేపల లారీలో విశాఖపట్నం( Visakhapatnam) తరలించినట్లు జగ్గయ్యపేట తహశీల్దార్ ఎదుట నిందితులు సరెండర్ అయిన విషయం తెలిసిందే.
అయితే ఎల్లయ్య హత్య జరిగినట్లు నిర్దారణకు వచ్చిన పోలీసులు డెడ్ బాడీ దొరకకపోవడంతో దర్యాప్తు లోతుగా మొదలుపెట్టారు.ఎట్టకేలకు బుధవారం ఎల్లయ్య మర్డర్ మిస్టరీని ఛేదించారు.
మృతదేహాన్ని చేపల లారీలో విశాఖపట్నం తరలించినట్లు నిందితులు చెప్పింది నేరం నుండి తప్పించుకునేందుకు ఆడిన డ్రామాగా తేల్చారు.పోలీసుల కథనం ప్రకారం.
.పథకం ప్రకారం నిందితులు వడ్డే ఎల్లయ్యను హత్య చేసిన అనంతరం జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామ శివారులో మృతదేహాన్ని కాల్చే ప్రయత్నం చేశారు.
మంటలు పెద్ద ఎత్తున వ్యాపించగా భయపడి మంటలను చల్లార్చి,అక్కడే గుంత తీసి పాతి పెట్టారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జగ్గయ్యపేట( Jaggaiahpet) తాహాశీల్దార్,కుటుంబ సభ్యుల సమక్షంలో అక్కడే పోస్టు మార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇంటి నుండి వెళ్ళిన 19 రోజులకు శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.పోలీస్ భద్రతా నడుమ ఎల్లయ్య మృతదేహాన్ని అంత్యక్రియలు కోసం స్వగ్రామమైన సూర్యాపేట రూరల్ మండలం యర్కారం తరలించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.