సూర్యాపేట జిల్లా: గత సంవత్సరం డిసెంబర్ 28 నుండి ప్రారంభమైన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగిసిందని,శనివారం నుండి ప్రజాపాలన లాగిన్ ద్వారా దరఖాస్తులు ఆన్లైన్ లో పొందుపర్చడం జరుగుతున్నదని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు.
శనివారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో జరుగుచున్న ఆన్లైన్ విధానాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం వరకు జిల్లాలో సుమారు 3 లక్షల 21 వేల దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు.
చివరి రోజైన శనివారం ఇంకో 50 వేల దరఖాస్తులు రావొచ్చని,అన్నిటిని ఆన్లైన్ లో పొందు పరుచుటకు జిల్లాలోని అన్ని విభాగాలలో పని చేయుచున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుట జరిగిందన్నారు.వాటిని సంబంధిత పాయింట్ పర్సన్ దగ్గర ఉండి ఆన్లైన్ చేయించుట జరుగుతున్నదని,ప్రెవేట్ ఆన్లైన్ సెంటర్లకు,బయట ఆపరేటర్లను ఎవరిని నియమించకోకుండా జిల్లా ఉద్యోగులతోనే పనులు చేయించుట జరుగుతున్నదన్నారు.
ప్రజాపాలనకు సంబంధించి నియమించిన నోడల్ అధికారులు,మున్సిపల్ కమిషనర్లు,తహశీల్దార్లు, ఎంపిడీఓలు ఆన్లైన్ సక్రమముగా అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశించుట జరిగిందన్నారు.సూర్యాపేట మున్సిపాల్టీలో అధికంగా దరఖాస్తులు వచ్చాయని, అవసరం అనుకుంటే అదనంగా సిబ్బందిని నియమించి ఆన్లైన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ సురేష్, మున్సిపల్ కమీషనర్ పి.రామానుజుల రెడ్డి, మెప్మా పిడి రమేష్ నాయక్,ఎస్ఎస్ఆర్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.