సూర్యాపేట జిల్లా:తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా( Suryapet District )లో ఈ సారి హస్తం పార్టీ హవా కొనసాగడానికి అసలు కారణాలు ఏమిటి? 2018 ఎన్నికల్లో నాలుగు నియోజక వర్గాల్లో సూర్యాపేట,కోదాడ,తుంగతుర్తి స్థానాలు కైవసం చేసుకున్న కారు పార్టీ ఒక్క హుజూర్ నగర్( Huzur Nagar ) మాత్రమే కోల్పోయింది.కానీ,అక్కడ గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలవడంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది.
దీనితో టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఉత్తమ్ చేతిలో ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి మళ్ళీ బరిలో నిలిచి,ఉత్తమ్ సతీమణి పద్మావతి(కాంగ్రెస్)పై అఖండ విజయం సాధించడంతో జిల్లా మొత్తం గులాబీ క్లీన్ స్వీప్ చేసింది.ఇంతటి ఘన కీర్తి గల గులాబీ పార్టీ 2023 ఎన్నికల్లో బొక్క బోర్లా పడడానికి అసలు కారణమేమిటనేది జిల్లాలో రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుచిక్కని రహస్యంగా మారింది.
ఇంతకీ కారును బలంగా ఢీ కొట్టిన ఆ బుల్డోజర్ అవినీతేనా…? దాదాపు 10 ఏళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీ,తిరుగులేని అధినేత కేసీఆర్ నాయకత్వం,బలమైన పార్టీ క్యాడర్,జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు,పైగా అందులో ఒకరు ఉమ్మడి నల్లగొండ జిల్లాను శాసించే మంత్రి జగదీష్ రెడ్డి.ఇంత బలమైన పార్టీకి ప్రజలు ఎందుకు చుక్కలు చూపించారు.
నాలుగింటిలో మూడుచోట్ల భారీ మెజార్టీ ఇచ్చి హస్తానికి జై కొట్టిన ఓటర్లు,ఒక్క సూర్యాపేటలో చావు తప్పి కన్ను లొట్టపడ్డట్లు కారును కాస్త ముందుకు నడిపించారు.దీనితో జిల్లాలో అనూహ్యంగా హస్తం పార్టీ పై చెయ్యి సాధించింది.
దీనికి ప్రధాన కారణం గులాబీ ఎమ్మెల్యేలపై వచ్చిన అవినీతి ఆరోపణలేనని సగటు మనిషి కూడా అనుకోవడమేనట.కోదాడ( Kodad ) కొంప ఎలా మునిగింది…? రాష్ట్ర సరిహద్దులో ఉన్న నియోజకవర్గం కోదాడ.2018 ఎన్నికల్లో టీడీపీ నుండి ఆఖరి నిమిషంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా వచ్చి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతిపై 730 స్వల్ప ఓట్ల మెజారిటీతో బొల్లం మల్లయ్య యాదవ్ బయటపడ్డారు.అప్పటి నుండి ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి.ముఖ్యంగా దళిత బంధులో అది అవధులు దాటింది.లబ్ధిదారుల వద్ద లక్షల్లో కమిషన్ తీసుకున్నారని బాధితులు రొడ్డెక్కడంతోపాటు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నాయకులను, మాజీ ఎమ్మెల్యే చందర్ రావు లాంటివాళ్ళను బొల్లం పక్కన పెట్టారు.దీనితో వారంతా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూటమి కట్టారు.
అయినా అవేవీ పట్టించుకోకుండా బొల్లం ఏకపక్షంగా ముందుకెళ్ళారు.చివరికి వారతా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే చందర్రావు పద్మావతి విజయం కోసం అవార్నిశలు కృషి చేశారు.ఎన్నికల్లో కనివిని ఎరగని రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి బొల్లం మల్లయ్యపై( Mallaiah Yadav Bollam ) సుమారు 57 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది రివెంజ్ తీర్చుకున్నారు.ఉత్తమ్ పద్మావతికి 1,24,110 ఓట్లు రాగా బొల్లం మల్లయ్య యాదవ్ కు 67,014 ఓట్లు వచ్చాయి.1978 లో నియోజకవర్గంగా ఏర్పాటు నుండి నేటి వరకు 58 వేల పైచిలుకు భారీ మెజారిటీతో రావడం చరిత్రలో ఎప్పుడూ లేదు.హుజూర్ నగర్ బేజారు ఎందుకైంది…?గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఓటమి చెంది, ఉప ఎన్నికల్లో తిరిగి ఆయన సతీమణి పద్మావతిపై సుమారు 40 వేల ఓట్లతో విజయం సాధించారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తంకుమార్ రెడ్డి చేతిలో 44,488 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
కాంగ్రెస్ పార్టీకి 1,18,269 ఓట్ల రాగా బీఆర్ఎస్ పార్టీకి 72,542 ఓట్లు వచ్చాయి.ఇక్కడ కూడా ఎమ్మేల్యేపై అవినీతి,భూ కబ్జాలు,దౌర్జన్యాలు,అక్రమ కేసులు వంటి ఆరోపణలు వచ్చాయి.అంతేకాకుండా ఎన్నికల ప్రచార సమయంలో పార్టీ వీడిన,వీడాలని అనుకునే వారికి నేను గెలిచాక సైదిరెడ్డి పాత సైదిరెడ్డిలా మారి అంతు చూస్తానని మాస్ వార్నింగ్ ఇచ్చారు.సొంత పార్టీ నాయకులను పట్టించుకోకపోవడం,ప్రజా ప్రతినిధుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం సైదిరెడ్డి ఓటమికి కారణాలుగా చెబుతున్నారు.తుంగతుర్తిలో తతంగం ఏమిటి…2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి అద్దంకి దయాకర్ పై స్వల్ప తేడాతో వరుస విజయాలు సాధించి,హ్యాట్రిక్ కోసం ఊపుమీదున్న బీఆర్ఎస్ ఎమ్మేల్యే గాదరి కిశోర్ కుమార్ 2023 ఎన్నికల్లోకాంగ్రెస్ అభ్యర్ధి మందుల సామేల్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు.2018 ఎన్నికల్లో గాదరు కిషోర్ కు 90,857 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దయాకర్ కు 89,010 ఓట్లు వచ్చాయి.ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామేలుకు 1,29,535 ఓట్లు రాగా గాదారి కిషోర్ కు 78,441 ఓట్లు వచ్చాయి.సుమారు 51,094 ఓట్లతో భారీ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సొంతం చేసుకున్నారు.
ఇక్కడ నుండి గాదరి కిషోర్ రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ ల్యాండ్,సాండ్ మాఫియాతో పాటు దళిత బంధులో విపరీతమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు.అదే కాకుండా ఓ దళిత ఎమ్మేల్యే అయి ఉండి దళితులపై దాడులు, దౌర్జన్యాలు చేయించారనేచెడ్డ పేరు రావడం,ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేసులు, అహంకారంతో కూడిన నడవడిక తోడై తన ఓటమికి తానే కారణమయ్యారని గులాబీ శిబిరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.సూర్యాపేటలో మంత్రి గెలుపు ఎలా సాధ్యం…? 2014,2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రామిరెడ్డి దామోదర్ రెడ్డిపై తక్కువ మెజారిటీతో గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రిగా,కేసిఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు.2018 ఎన్నికల్లో సుమారు 5000 ఓట్లతో విజయం సాధించిన జగదీష్ రెడ్డి,2023 ఎన్నికల్లో 4600 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామిరెడ్డి దామోదర్ రెడ్డిపై విజయం సాధించారు.మంత్రిగా కొనసాగుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ చేయడం వల్లే విజయం సాధించారని కాంగ్రెస్ అభ్యర్ధి ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ప్రకటనలో ఆలస్యం చేయడం, కాంగ్రెస్ పార్టీ డబ్బు పంపిణీలో వెనుకబడడం జగదీశ్ రెడ్డికి కలిసొచ్చిందని, అయినా చివరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొందని,కాంగ్రెస్ పార్టీ స్వయం కృతాపరాధం వల్లే ఇక్కడ ఓటమి చెందిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని అమాంతం పెంచుకుందని, దానికి బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు,స్థానిక ఎమ్మెల్యేల పోకడ కూడా ప్రధాన కారణమని చెప్పక తప్పదు.