సూర్యాపేట జిల్లా:డిసెంబర్ 3న జరిగే ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనాలని, వికలాంగుల దినోత్సవం ముందస్తు సంబరాల్లో భాగంగా ప్రతీ జిల్లాకు 3 కోట్లు కేటాయించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దెరాజేష్ డిమాండ్ చేశారు.బుధవారం మఠంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన మండల నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొని మఠంపల్లి మండల నూతన అధ్యక్షుడు దరావత్ నాగరాజు నాయక్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలోనే వికలాంగుల దినోత్సవంలో పాల్గొనకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రకెక్కాడని విమర్శించారు.
ఈసారి జరిగే వికలాంగులు దినోత్సవంలోనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని వికలాంగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేయాలని,వికలాంగుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రతి జిల్లాలో విలాంగుల క్రీడలను నిర్వహించి,క్రీడల్లో ప్రతిభ కనపరిచిన వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రధానం చేయాలన్నారు.దళిత బంధు మాదిరిగానే సమాజంలో అట్టడుగున ఉన్న వికలాంగుల సామాజిక వర్గం అభ్యున్నతి కోసం వికలాంగుల బంధు పథకం తీసుకురావాలని కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని,నూతన జిల్లా కేంద్రాల్లో వికలాంగుల హాస్టల్స్ కమ్యూనిటీ భవనాలను నిర్మించాలని,వికలాంగులకు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలు వికలాంగుల సంఘాలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.వికలాంగులకు ప్రభుత్వ,ప్రైవేటు రంగంలోనూ ఉచిత విద్య ఉచిత రవాణా ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని రాష్ట్రంలో వికలాంగుల మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
సంఘం మండల నూతన అధ్యక్షుడు దరవత్ నాగరాజు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కోల్లూరి ఈదయ్య బాబు,జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కుర్ర గోపి యాదవ్,పాలకవీడు మండల అధ్యక్షుడు రాచమల్ల సైదులు యాదవ్,మండల నాయకులు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.