సూర్యాపేట జిల్లా:జాన్ పహాడ్ దర్గాకు వచ్చేవారు స్థానిక పుష్కర ఘాట్ కు వెళ్తుంటారు.అయితే ఇక్కడ సరైన రక్షణ చర్యలు,ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలకు గురై ఏడాదికి పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.
ప్రమాదాలు జరిగినప్పుడే తప్ప,అటువైపు పాలకులు, ల్అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకవీడు మండలంలో మహంకాళిగూడెం ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామం.
ఇక్కడ పచ్చటి అడవులు,కొండల నడుమ కృష్ణానది గలగలమని పారుతూ పర్యాటక ప్రదేశంగా అలరారుతుంది.అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఈ గ్రామంలో పుష్కర ఘాట్ ఏర్పాటు చేశారు.
ఈ ప్రాంతానికి అతి దగ్గరలో ప్రసిద్ధిగాంచిన జన్ పహాడ్ దర్గాకు నిత్యం వందలాది మంది భక్తులు,పర్యాటకులు వస్తూ దగరలోని పుష్కర ఘాట్ లో ఆహ్లాదంగా గడిపేందుకు వస్తుంటారు.నిత్యం పర్యాటకుల తాకిడితో ఉండే పుష్కర ఘాట్ దగ్గర ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడంతో స్నానాల కోసం నదిలో దిగే వారు ప్రమాదాల బారినపడుతున్నారు.
దీనితో విహారాలు కాస్త విషాదాలుగా మారుతూ అనేక కుటుంబాల్లో కన్నీళ్లకు కారణమవుతూ డెత్ స్పాట్ గా మారింది.ఇటీవల దర్గాకు కందూరు కోసం వచ్చిన గుంటూరు జిల్లా సంగాడిగుంటకు చెందిన ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన విషయం మండలంలో అందరినీ కంటతడి పెట్టించింది.
ఇలా ప్రతి సంవత్సరం ఐదు నుండి ఆరు మంది కృష్ణానదిలో ప్రాణాలు కోల్పోతూ ఉంటే స్థానిక ప్రజలు అయ్యోపాపం అనడం మినహా అధికారులు కానీ,పాలక వర్గాలు కానీ,చేసింది శూన్యం.చనిపోయిన వారు మన ఓటరు కాదుకదా అని ప్రజా ప్రతినిధులు ప్రమాద స్థలాన్ని కూడా కనీసం పరిశీలించకపోవడం దారుణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాల నివారణపై సరైన దృష్టి సారించకపోవడంతో ఈ ప్రమాదాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఆందోళన కలిగిస్తున్న విషయమని చెబుతున్నారు.ఇప్పటికైనా నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మహంకాళిగూడెం పుష్కర్ ఘాట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి ప్రమాదాలపై రక్షణ శాఖ,వక్స్ బోర్డ్,దగ్గరలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి ప్రమాదాల నివారణకై చర్యలు తీసుకోవాలని జాన్ పహాడ్ సైదులు స్వామి భక్తులు,స్వచ్ఛంద కార్యకర్తలు,వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇకపై కృష్ణానది పుష్కర ఘాట్ ప్రమాదాలు నివారించేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని పాలకవీడు ఎస్ఐ సైదులు గౌడ్ తెలిపారు.ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రమాదాలకు గురై మరణించిన వారి ఫొటోస్ ఏర్పాటు చేస్తామని,దర్గా దర్శనం కోసం వచ్చే భక్తులకు ఈ ప్రాంత కృష్ణానది లోతును వివరించే విధంగా జాన్ పహాడ్ దర్గా అధికారులతో చర్చించి,శాశ్వత పరిష్కారం కోసం భక్తులు స్నానాల కొరకు నది లోపలికి వెళ్లకుండా జాలి ఏర్పాటు చేసే విధంగా లెటర్ పెడతామన్నారు.
ప్రమాదాలు జరగకుండా ఉన్నతాధికారులతో చర్చించి నివారణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.