సూర్యాపేట జిల్లా:రోడ్డు వెడల్పుకు ఎవరూ వ్యతిరేకం కాదని,నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఇండ్లు కూల్చాలని బాధితులు చెబితే పోలీసులను కాపలా పెట్టి ఇండ్లను కూల్చడం అన్యాయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు విమర్శించారు.ఆత్మకూరు (ఎస్) మండల కేంద్రంలో రోడ్డు వెడల్పులో భాగంగా సర్వం కోల్పోయి విలపిస్తున్న బాధితులను శనివారం సాయంత్రం ఆయన పరామర్శించారు.
ఇల్లు కోల్పోయిన ఒంటరి మహిళకు ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన సంకినేని,ఇల్లు కోల్పోయిన మనోవేదనతో ఒక మహిళ అనారోగ్యానికి గురైతే హాస్పిటల్ కు పంపించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇండ్లను కూల్చివేయడంతో ఇంట్లోని సామాగ్రి కూడా ధ్వంసం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటు వేసి గెలిపించిన పాపానికి జగదీష్ రెడ్డి “నేనే రాజు,నేనే మంత్రి,నేను చెప్పిందే వేదం,నేను చేసేదే చట్టం” అన్నట్టుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.రోడ్ల వెడల్పులో పోలీసులు,ఆర్ అండ్ బి అధికారులు,రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరు సరైనది కాదని అన్నారు.
ఇల్లు మరియు ఇంటి స్థలం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.